భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన
ఆదిత్య ఎల్1 ప్రయోగంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత
కీర్తి ప్రతిష్టలను మరోమెట్టు ఎక్కించే ఈ ప్రయోగం విజయవంతం కావాలని దేశ ప్రజలందరూ
కోరుకుంటున్నారు.
ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో హోమం నిర్వహించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో
ఆలయాలు, మందిరాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు. సూర్యుడి రహస్యాలను కనుగొనే
లక్ష్యంతో జరుగుతున్న ఆదిత్య ప్రయోగం సఫలమవ్వాలని కోరుతూ ప్రజలు తమ ఇష్టదైవాలను
ఆరాధిస్తున్నారు. మరోవైపు, ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు
పెద్దసంఖ్యలో ఔత్సాహికులు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు చేరుకున్నారు.
భారత్ తాజా ప్రయోగాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా
గమనిస్తోంది. రోదసీ ప్రయోగాల్లో భారత్ ప్రదర్శిస్తున్న ప్రతిభ శాస్త్ర ప్రపంచాన్ని
అబ్బురపరుస్తోంది. చంద్రయాన్3 ప్రయోగం విజయవంతమైన కొద్దిరోజులకే సూర్యుణ్ణి చుట్టే
ప్రయోగం చేపట్టిన భారత్ ధైర్యసాహసాలకు విస్తుపోతున్నారు.
శాస్త్రసాంకేతిక రంగాల్లో భారతదేశం గణనీయమైన
విజయాలను సాధిస్తోందంటూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మాజీ కమాండర్ క్రిస్ హడ్ఫీల్డ్
ప్రశంసించారు. ‘‘సూర్యుణ్ణి మరింత సమర్థంగా అర్ధం చేసుకోడానికి, దానినుంచి కలగగల
ముప్పులను పసిగట్టడానికి ఈ ప్రయోగం ఉపయుక్తమవుతుంది. భూమండలంపై సూర్యుడి
ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడుతుంది. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్
సాధిస్తున్న ఘనవిజయాలు ఒక్క భారతదేశానికే కాక, మొత్తం ప్రపంచం అంతటికీ గర్వకారణం’’
అని వ్యాఖ్యానించారు.