భారతదేశం హిందూ దేశమని, భారతీయులందరూ
హిందువులేననీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.
హిందువు అన్న పదం భారతీయులందరికీ వర్తిస్తుందని భాగవత్ పునరుద్ఘాటించారు. సంఘానికి
ప్రజల ఆకాంక్షలే ముఖ్యమని ఆయన చెప్పారు.
నాగపూర్లో దైనిక్ తరుణ్ భారత్ పత్రికను నడిపే
శ్రీ నరకేసరి ప్రకాశన్ వారి నూతన భవనం ప్రారంభోత్సవంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు.
అక్కడ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
‘‘హిందుస్తాన్ హిందువుల దేశం అనేది సత్యం.
సిద్ధాంతపరంగా భారతీయులు అందరూ హిందువులు. హిందువులు అంటే అందరు భారతీయులూ అని
అర్ధం. భారతదేశంలో నేడు నివసిస్తున్న వారంతా హిందూ సంస్కృతికి చెందినవారు, హిందూ
పూర్వీకుల వారసులు, హిందూ భూమికి చెందిన వారు. అంతకు మించి ఇంకేం లేదు.’’ అని
భాగవత్ అన్నారు.
‘‘ఈ విషయాన్ని కొంతమంది అర్ధం చేసుకున్నారు. మరికొందరికి
ఈ విషయం అర్ధమైనా దాన్ని అమలు చేయడం లేదు. దానికి కారణం వారి అలవాట్లు, స్వార్థమే.
మరికొంతమందికి ఈ విషయం అర్ధం కాలేదు లేదా వారు మరచిపోయారు’’ అని వ్యాఖ్యానించారు.
భారతీయ సనాతన ధర్మానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ
పెరుగుతోందని, నిజానికి మన ధర్మానికి, మన సనాతన ఆలోచనా ధోరణికి ప్రత్యామ్నాయమే
లేదని భాగవత్ చెప్పారు. ‘‘ఈ విషయాన్ని అందరూ అర్ధం చేసుకున్నారు. కొంతమంది
గుర్తిస్తారు, కొందరు గుర్తించరు, అంతే’’ అన్నారాయన.
మోహన్ భాగవత్ తన
ప్రసంగంలో, ప్రస్తుత తరుణంలో పర్యావరణ పరిరక్షణ తక్షణ ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా
ప్రస్తావించారు. స్వదేశీ వస్తువుల వినియోగం, కుటుంబ విలువలు, క్రమశిక్షణ పట్ల
ప్రజలందరూ దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.