ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి పోటీ చేయాలని ముంబయిలో జరిగిన మూడో వ్యూహాత్మక సమావేశాల్లో నిర్ణయించారు. కూటమిలోని 14 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఇవాళ ప్రకటించారు.
సమన్వయ కమిటీలో కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్ , శరద్ పవార్ (ఎన్సీపీ), టి.ఆర్.బాలు (డీఎంకే), హేమంత్ సోరెన్(జేఎంఎం), సంజయ్ రౌత్ ( ఎస్ఎస్ యూబీటీ ), తేజస్వి యాదవ్ (ఆర్జేడి), అభిషేక్ బెనర్జీ ( టీఎంసీ), రాఘవ్ చద్దా (ఆప్), జావీద్ అలీఖాన్ (ఎస్పీ), లలన్ సింగ్ (జేడీయూ), డి.రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపి), సీపీఐ(ఎం) నుంచి ఒకరికి సమన్వయ కమిటీలో చోటు దక్కింది. అయితే కన్వీనర్ విషయంలో ఇండియా కూటమి ఎటూ తేల్చలేదు.
వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై సాధ్యమైనంత త్వరగా కార్యాచరణ ప్రారంభించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సీట్ల సర్దుబాటు ఉండాలని కూటమి తీర్మానం చేసింది. ప్రజల సమస్యలపై అన్ని పార్టీల నేతల ఆధ్వర్యంలో , వారివారి రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు.
భారత్ జుడేగా, ఇండియా జీతేగా అనే కొత్త నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. భారత్ కలసి ఉంటుంది, ఇండియా గెలుస్తుంది అనే నినాదంలో రాజకీయంగా ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటూ, మీడియాను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించారు.
ప్రభుత్వ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలపై ఎదురుదాడి చేసేందుకు సిద్దంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూటమి పార్టీల నాయకులపై మరిన్ని దాడులు, అరెస్టులు ఉంటాయని, ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఇదే జరిగిందన్నారు. గత వారం జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ బీజేపీ దాడులు మొదలుపెట్టిందన్నారు.
గడచిన తొమ్మిదేళ్లుగా బీజేపీ, వీహెచ్‌పీలు మతం అనే విషాన్ని చిమ్మాయని దీని వల్ల అమాయక రైలు ప్రయాణీకులు, పాఠశాల పిల్లలపై దాడులు పెరిగాయన్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహాలు రూపొందించుకుని అమలు చేసేందుకు ముంబయిలో ఇండియా కూటమిలోని సభ్యులతో మూడో సమావేశాలు నిర్వహించారు. ఇండియా కూటమి మొదటి సమావేశం జూన్ 23న పాట్నాలో, జులై 17, 18 తేదీల్లో రెండో సమావేశాలు బెంగళూరులో నిర్వహించిన సంగతి తెలిసిందే.