విపక్షాల
తీరును పార్లమెంటరీ వ్యవహారాలశాఖమంత్రి
ప్రహ్లాద్ జోషి తప్పుబట్టారు.ఒకే
దేశం- ఒకే ఎన్నిక అంశంపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చర్చఉంటుందని, దానిపై చర్చించేందుకు
ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిణామ దశపై
చర్చించేందుకు ఎందుకు జంకుతున్నారని విపక్ష పార్టీలను ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యానికి
భారతదేశం తల్లివంటిదన్న ప్రహ్లాద్ జోషి..
ప్రజాస్వామ్య పరిణామక్రమంలో దేశానికి మేలు చేసే ప్రతి అంశంపై చర్చలు
ఉంటాయని తెలిపారు. జమిలీ
ఎన్నికలపై కమిటీ ఇచ్చే నివేదిక, సూచనల ఆధారంగా పార్లమెంటులో చర్చ ఉంటుందని
వివరించారు. 1967 వరకు దేశంలో జమిలి ఎన్నికలే జరిగాయని గుర్తు చేసిన పార్లమెంటరీ
వ్యవహారాల శాఖ మంత్రి.. తరుచుగా ఎన్నికల నిర్వహణతో భారీ ఖర్చు చేయాల్సి
వస్తుందని… ఇది చర్చించాల్సిన విషయమన్నారు.
పార్లమెంట్
ప్రత్యేక సమావేశాలకు నిర్వహణకు కేంద్రం సిద్ధమైంది. సెప్టెంబర్ 18 నుంచి
సెప్టెంబర్ 22 వరకు జరిగే ఈ సమావేశాల్లో ‘‘ఒకే దేశం-ఒకే ఎన్నిక ’’ బిల్లు
ప్రవేశపెట్టే అవకాశముందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. పార్లమెంట్
అజెండాను వెల్లడించేందుకు నిరాకరించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, సమావేశాలు
ప్రారంభమైన తర్వాత చెబుతానన్నారు.
‘ఒకే
దేశం-ఒకే ఎన్నిక’ నిర్వహణపై మాజీ రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన కేంద్రప్రభుత్వం
కమిటీ ఏర్పాటు చేసింది. దేశంలో ఒకేసారి లోక్‌సభ, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల
నిర్వహణపై సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కమిటీలో మరో 16 మంది
సభ్యులుగా ఉంటారు. పూర్తివివరాలతో త్వరలో కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల
చేయనుంది. పార్లమెంటరీ
స్టాండింగ్ కమిటీ, లా కమిషన్, నీతి అయోగ్ లు ఈ ప్రతిపాదనపై ఇప్పటికే నివేదిక
అందజేసాయి.
పాలక
పార్టీ ప్రతిపాదనను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దేశం ఎన్నో సమస్యలను
ఎదుర్కొంటుందని వాటికి కేంద్ర పరిష్కారం చూపలేకపోతుందని ఎద్దేవా చేస్తున్నాయి. ‘‘
రైతుల ఇబ్బందులు, నిరుద్యోగం పెరుగుదల, చైనా దూకుడు’’ వంటి అంశాలపై చర్చిస్తే తాము
స్వాగతిస్తామని శివసేన( యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేదీ చెప్పారు. పేదరికం,
అవినీతి, మహిళల రిజర్వేషన్ ఎప్పుడు కమిటీ వేస్తారని నిలదీశారు.
ఒకే దేశం-ఒకే ఎన్నిక అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ
పలుమార్లు వివరించారు. 2020 నవంబర్ లో ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో పాల్గొన్న
ప్రధాని నరేంద్ర మోదీ.. జమిలి ఎన్నికలు దేశానికి అవసరమని పేర్కొన్నారు. తరచుగా
ఎన్నికల నిర్వహణ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారిందని.. దాని కోసం దేశం ఎందుకు
వృథా ఖర్చు చేయాలని ప్రశ్నించారు.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ