ఏపీలో విద్యుత్ కార్మిక సంఘాల సమ్మెకు హైకోర్టు అనుమతించింది. తమ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు అనుమతి కావాలంటూ పెట్టుకున్న పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. విద్యుత్ కార్మిక సంఘాలు వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, ధర్నాకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. విజయవాడలో సెప్టెంబరు 10న ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల్లోపు ధర్నా చేసుకోవచ్చని కోర్టు తీర్పు వెలువరించింది.
విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో సంఘాల నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్లు హైకోర్టులో కేసు వేశాయి. దీనిపై ఇవాళ విచారించిన హైకోర్టు, విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది.