ఇటీవల చైనా తమ ప్రామాణిక మ్యాప్ అని విడుదల చేసిన
మ్యాప్‌లో భారతదేశపు కొన్ని ప్రాంతాలను తమ దేశపు ప్రాంతాలుగా చూపుతున్న గొడవ
తెలిసిందే. చైనా వాదనలను భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే చైనా కేవలం భారత
భూభాగాలను మాత్రమే తమవిగా చెప్పుకోలేదు. మరో నాలుగు దేశాల ప్రాంతాలను సైతం తన
మ్యాప్‌లలో కలిపేసుకుంది. ఆ దేశాలు సైతం చైనా దుశ్చర్య పట్ల మండిపడుతున్నాయి.
చైనా మ్యాప్‌ను వియత్నాం దేశం వ్యతిరేకించింది.
స్ప్రాట్లీ, పారాసెల్ దీవులపై తమ సార్వభౌమత్వాన్ని చైనా ఉల్లంఘిస్తోందని ఆగ్రహం
వ్యక్తం చేసింది. ఆ జలాలపై తమ పరిధి హక్కులను సైతం చైనా త్రోసిరాజనడాన్ని వియత్నాం
తప్పుపట్టింది. ఆ మేరకు వియత్నాం ప్రభుత్వ వెబ్సైట్లో ఒక ప్రకటన ఉంచింది.
వియత్నాం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఫాం థూ హాంగ్ ఆ ప్రకటనలో ‘‘తొమ్మిది
చుక్కలతో గీత పెట్టి మా దీవులపై చైనా తమ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక జలాలపై
హక్కులను ప్రకటించుకున్న ఆ మ్యాప్ చెల్లబోదు. ఆ గీత ఆధారంగా దక్షిణ చైనా సముద్రం
తమదేనంటూ చైనా చేస్తున్న ప్రకటనలను వియత్నాం పూర్తిగా ఖండిస్తోంది’’ అని స్పష్టం
చేసారు.
భారతదేశం ఇప్పటికే ఆ మ్యాప్‌ను తిరస్కరించింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను చైనా తమ భూభాగంగా చూపించుకోడాన్ని
తప్పుపట్టింది. మరికొన్ని ఆసియా దేశాలు కూడా చైనా కుట్రపై మండిపడుతున్నాయి.
దక్షిణ చైనా సముద్రంలో విస్తరణ వాదంతో ముందుకు
వెడుతూ చైనా పలు ప్రాంతాలను ఆక్రమించి, తమ దేశంలో భాగంగా కలిపేసుకుంది. ఆ విస్తరణ
వాదాన్ని గుర్తించడం లేదని ఫిలిప్పీన్స్ స్పష్టం చేసింది. మలేసియా, తైవాన్
ప్రభుత్వాలు సైతం తమ భూభాగాలను చైనా తన సొంతంగా చూపించడం మీద ఘాటైన పదజాలంతో
మండిపడ్డాయి.
మ్యాప్ మంట రగిలించిన చైనా మాత్రం ఆసియా దేశాలకు
సుద్దులు చెబుతోంది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిది వాంగ్ వెన్బిన్ ‘‘ఆ
దేశాలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఉంటాయని, అతి వ్యాఖ్యానాలు చేయకుండా
నియంత్రించుకుంటాయనీ భావిస్తున్నాను’’ అన్నాడు.
1947నాటి పాత మ్యాప్‌లో దక్షిణ చైనా సముద్రం మీద తొమ్మిది
చుక్కలతో ఒక గీత ఉంది. ఆ ప్రాంతం హైనాన్ దీవికి సుమారు 18వందల కిలోమీటర్ల దూరంలో
ఉంటుంది. ఆ మ్యాప్ ఆధారంగా దక్షిణ చైనా సముద్రంలో 80శాతం ప్రాంతం తమదేనని చైనా చెప్పుకుంటూ
ఉంటుంది. అయితే ఆ ప్రాంతంలో సముద్ర జలాలపై తమకు కూడా హక్కులున్నాయని ఫిలిప్పీన్స్,
బ్రూనై, మలేసియా, తైవాన్ దేశాల వాదన. ఆ సముద్రంలో సరిహద్దుల గురించి చైనాతో ఆ
దేశాలు ఎల్లప్పుడూ గొడవ పడుతూనే ఉన్నాయి.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు