సూర్యుడిపై
పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపడుతున్ ఆదిత్య ఎల్-1 లాంచింగ్ కు రంగం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని
సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఈ ప్రయోగానికి శుక్రవారం ఉదయం 11.50గంటలకు కౌంట్
డౌన్ మొదలైంది. 24 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. సెప్టెంబర్ 2న
ఉదయం 11.50 గంటలకు ఎఎస్ ఎల్వీ సి -57 ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని నింగిలోకి
మోసకెళ్ళనుంది.
ప్రయోగం
విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ సోమనాథ్, తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సూళ్ళూరుపేట ఆలయానికి కూడా వెళ్లి
అమ్మవారిని దర్శించుకున్నారు.
సూర్యుడిని
అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగం ఇదే. కరోనాగ్రఫీ పరికరం సాయంతో
సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించేందుకు ఈ ప్రయోగం దోహదం చేయనుంది. భూమి నుంచి
సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్-1 చుట్టూ ఉన్న
కక్ష్యలో దీనిని ప్రవేశపెడతారు.గమ్యాన్ని
చేరేందుకు సమారు నాలుగు నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
శాటిలైట్ బరువు 1,500 కిలోలు కాగా, మొత్తం ఏడు పేలోడ్లను మోసకెళ్తుంది. ఇందులో
ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనా గ్రాఫ్ తో పాటు సోలార్ అల్ట్రావైలెట్
ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పెరిమెంట్, ప్లాస్మా
అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, హై
ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ పేలోడ్లను
అమర్చారు.
సూర్యుడి
నుంచి వెలువడుతున్న కిరణాల ప్రసారం ఇప్పటిలాగానే భవిష్యత్ లో ఉంటుందా అనే అంశంపై
శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. ఒకవేళ భవిష్యత్ లో సూర్యుని నుంచి వెలువడే
రేడియేష్ తగ్గితే అది భూ వాతావరణంపై భారీ ప్రభావం చూపనుంది. లాగ్రాంజియన్ పాయింట్
నుంచి సుదీర్ఘ కాలం పాటు సూర్యుడిని పర్యవేక్షించగలిగితే ఇప్పటి వరకు మానవాళికి తెలియని
సూర్యుని చరిత్ర తెలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి
11 ఏళ్ళకు సూర్యడిలోని అయస్కాంత చర్యల్లో మార్పులు కనిపిస్తాయి. దీనినే సోలార్ సైకిల్
అని పిలుస్తారు. దీని గురించి తాజా ప్రయోగం ద్వారా వివరంగా తెలుసుకోవచ్చు.