దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే రాజకీయ విశ్లేషకుల అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రకటించిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు అత్యవసర సమావేశాల్లో దీనిపై బిల్లు తీసుకు రావచ్చనే ఊహాగానాలకు కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మరింత ఊతమిచ్చేలా ఉంది.
ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది లోక్సభ ఎన్నికలతోపాటు, దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించాలని సూచిస్తోంది. దేశంలో జమిలి ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే అనేక వేదికలపై మాట్లాడారు. 2014 బీజేపీ మ్యానిఫెస్టోలో ఒకే దేశం ఒకే ఎన్నిక హామీ ఇచ్చారు. అది నెరవేర్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.