కేంద్రప్రభుత్వం
కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు సీఈవో, చైర్‌పర్సన్‌గా జయావర్మ సిన్హాను
కేంద్రం నియమించింది. ఆమె నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ
బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా జయావర్మ రికార్డు నెలకొల్పనున్నారు.
ఇండియన్
రైల్వే మేనేజిమెంట్ సర్వీసెస్ అధికారిణి అయిన జయా వర్మ..ప్రస్తుతం రైల్వే బోర్డు
సభ్యురాలిగా ఉన్నారు. ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగంలో కీలక
బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31 వరకు లేదా తదుపరి
ఆదేశాలు వచ్చే వరకు సీఈవో బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇప్పటి వరకు సీఈవోగా అనిల్
కుమార్ లాహోటీ బాధ్యతలు నిర్వహించారు.
అలహాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన జయా
వర్మ.. 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో చేరారు. దేశవ్యాప్తంగా పలు
రైల్వే జోన్లలో వివిధ హోదాల్లో పనిచేశారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత
హైకమిషన్ లో రైల్వే సలహాదారుగా నాలుగేళ్ళపాటు పనిచేశారు. ఆ సమయంలోనే కోల్‌కతా
నుంచి ఢాకాకు మైత్రీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది.