పార్లమెంట్
ప్రత్యేక భేటీకి కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు
ఐదురోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. జీ-20 సదస్సు ముగిసిన
తర్వాత జరిగే ఈ సమావేశాల అజెండా ఏంటనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం
లేదు. అమృత్ కాల్ వేళ ఈ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా జరగాలని ఆశిస్తున్నామని
ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
ఈ సమావేశాలు
పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభమై కొత్త భవనంలో ముగుస్తాయని చెప్పారు.
ఏదైనా
కొత్త బిల్లు ప్రవేశపెట్టే అవకాశముందా అనే విషయంపై అధికారులు నోరు విప్పడం లేదు.
కేంద్ర
నిర్ణయం పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
గణేశ్ చతుర్థి, నవరాత్రి వేడుకల సమయంలో
పార్లమెంట్ నిర్వహణకు ఎలా సిద్ధమయ్యారని ప్రశ్నిస్తున్నారు. హిందువుల ఆరాధ్య
పండుగల్లో ఒకటైన వినాయక చవితి సందర్భంగా పార్లమెంట్ భేటీ తేదీలను మార్చాలని
శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేదీ కోరారు.
మరాఠీయులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే గణేశ్
చతుర్థి పండుగ రోజే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీలు ఒకే సారి రావడాన్ని ప్రస్తావించిన ఎన్సీపీ నేత సుప్రియా సూలే.. సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని పరిగణనలోకి
తీసుకుని సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయరాం రమేశ్ మాత్రం
మరోలా స్పందించారు. మీడియాను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన మోదీ, విపక్ష కూటమి
సమావేశాలకు ప్రాధాన్యం దక్కకుండా చేసే వ్యూహంలో భాగంగానే ప్రత్యేక పార్లమెంట్
సమావేశాలకు పిలుపునిచ్చారని ఆరోపించారు.
మోదాని కుంభకోణం, ముంబైలో విపక్ష కూటమి అంశాలను పక్కదోవ
పట్టించేందుకు మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టిన జయరాం రమేశ్.. మూడు వారాల
కిందటే పార్లమెంట్ సమావేశాలు ముగిశాయని గుర్తు చేశారు. అప్పడే ప్రత్యేక సమావేశాల
నిర్వహణకు పిలువునివ్వడంలో ఆంతర్యం ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించారు.
జీ 20 సదస్సులో కీలక చర్చలు, జమ్మూ-కశ్మీర్ లో
వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ
ప్రత్యేక సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమై
ఆగస్టు 23న ముగిశాయి. ఈ సమావేశాల్లో 23 బిల్లులను ప్రభుత్వం పాస్ చేసింది.
మణిపూర్
ఘటనకు నిరసనగా పార్లమెంట్ సాక్షిగా విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.
కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి సంయుక్తంగా
ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మూడు
రోజుల పాటు చర్చ జరిగింది.