భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు
కొత్తగా కట్టిన ఇండియా కూటమి దశా దిశా నిర్ణయించే కీలకమైన సమావేశాలు ఇవాళ, రేపు
ముంబైలో జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఈ కూటమి గణాంకాల పరంగా ఘనంగా కనిపిస్తోంది. కానీ
వారి మధ్య బంధం మాత్రం బలహీనంగా ఉన్నట్టు తెలిసిపోతోంది. వారి వైఖరి చూస్తే జాతీయ
స్థాయిలో నరేంద్ర మోదీని గద్దె దింపేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది, అయితే రాష్ట్ర
స్థాయిలో బీజేపీకి కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూటమి సభ్య పక్షాల్లో కనిపించడం
లేదు. కొన్నాళ్ళలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు శాసనసభ
ఎన్నికలు జరగనున్నాయి. ఇవేమీ చిన్న, అప్రాధాన్య రాష్ట్రాలు కావు. ఆ రాష్ట్రాల్లో ఈ
ఇండియా కూటమి పార్టీల్లోనూ, వాటి నాయకుల్లోనూ అయోమయం నెలకొని ఉన్నట్టు స్పష్టంగా
తెలుస్తూనే ఉంది. బెంగళూరు, పట్నాల్లో జరిగిన ఇండియా కూటమి మొదటి రెండు సమావేశాల్లా
ఈ ముంబై సమావేశం ఉండదు. ఈ సమావేశాల్లో కూటమి లోగో గురించి, కూటమి ఎజెండా గురించి
లేక సీట్ల పంపకం గురించి చర్చిస్తామని వాళ్ళు చెప్పుకుంటే చెప్పుకోనీ గాక… కానీ
వారి తదుపరి ఎత్తుగడలకు ప్రధానమైన అడ్డంకిగా నిలిచేది ఒక్క ప్రశ్నే. అదేంటంటే…. ఇండియా
కూటమికి కన్వీనర్ ఎవరవుతారు? ఆ ప్రశ్న కూటమి సభ్య పక్షాల తదుపరి ఎత్తులకు ప్రధాన
అడ్డంకిగా నిలుస్తుంది. కూటమిలోని వేర్వేరు రాజకీయ పార్టీల నాయకుల కచ్చితమైన
నమ్మకం ఏంటంటే కూటమి కన్వీనర్ పదవి పొందినవాళ్ళు ఆటోమేటిక్‌గా ఎన్నికల సమయంలో
ప్రధానమంత్రి అభ్యర్ధులు అయిపోతారు అని. అందువల్ల, కన్వీనర్ పదవి పొందడమే ఇప్పుడు ముఖ్యం.
మోదీకి పోటీదారుగా ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలను నడిపించడం అనేది తర్వాతి
సంగతి.
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీష్
కుమార్‌కు మొదటినుంచీ కూటమి కన్వీనర్ పదవిపైనే చూపు ఉందన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇంక,
బిహార్ ప్రభుత్వంలో భాగస్వామి, ఆర్జేడీ నేత, ఇప్పటికీ బెయిల్ మీదే బైట తిరుగుతున్న
నేరస్తుడు అయిన లాలూప్రసాద్ యాదవ్‌కు… కూటమిలో పెద్ద నాయకుడిగా నితీష్ ఎదగడం
ఇష్టం లేదు. నిజానికి, నితీష్ ప్రయత్నాల వల్లే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,
సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ అరవింద్
కేజ్రీవాల్ ఇండియా కూటమిలో చేరారు. అంతకు ముందు ఈ ముగ్గురు నాయకులూ కాంగ్రెస్,
బీజేపీలకు సమానదూరం అంటూ కొత్తగూడు కట్టిన బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి
కె చంద్రశేఖరరావుకు చేరువైనవారే. ఇప్పుడు తన గూటిలో వేరెవరూ లేక కేసీఆర్ ఒంటరి
పయనం సాగిస్తున్నారు.
ఆర్జేడీ నాయకత్వం ప్రకటనలను గమనిస్తే, నితీష్‌కు
కన్వీనర్ పదవి కట్టబెట్టడానికి వారు సుముఖంగా లేరన్న సంగతి ఇట్టే అర్ధమైపోతుంది. నితీష్
విషయంలో లాలూప్రసాద్ యాదవ్ ఇప్పుడేమీ అనడం లేదు కానీ ఒకప్పుడు నితీష్ జాతీయ ఆశలను
అడ్డుపెట్టుకుని అతన్ని బిహార్ బైటకు నెట్టేయాలని ఆర్జేడీ చూసిందన్న మాట నిజం. లాలూ
కుటుంబంలోని వారికే ముఖ్యమంత్రి పీఠం దక్కాలన్నది వారి ఆరాటం. అసలు లాలూ చిన్న
కొడుకు తేజస్వి యాదవ్‌నే సీఎంగా చూపబోయారు, కానీ, పెద్దకొడుకు తేజ్‌ప్రతాప్ యాదవ్
తిరుగుబావుటాతో పార్టీ నిట్టనిలువునా చీలిపోతుందన్న భయంతో లాలూ దానికి
ఒప్పుకోలేదు. తేజస్వి ఇప్పుడు బిహార్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ పదవికి తనను
కనీసం పరిగణించలేదన్న కడుపుమంట తేజ్‌ప్రతాప్‌కి ఇప్పటికీ ఉంది. అతని మొండితనం,
పెంకితనం, మంకుపట్టు ఎలాంటివో పట్నాలో ఒక పార్కుకు ఉన్న మాజీ ప్రధాని, బీజేపీ నేత
వాజ్‌పేయీ పేరును ఏకపక్షంగా మార్చేయడంలోనే తెలుస్తాయి. ఆగస్టు 12 వాజ్‌పేయీ జయంతి నాడు
నితీష్‌కుమార్ అదే పార్కులో వాజ్‌పేయీపై ప్రశంసల జల్లు కురిపించాడు. సహజంగానే తేజ్‌ప్రతాప్‌కు
అది రుచించలేదు. అలా, నితీష్‌కుమార్ ఆర్జేడీ నేతలు అందరినుంచీ తీవ్ర వ్యతిరేకత
ఎదుర్కోంటున్నాడు. అందుకే నితీష్ మళ్ళీ తన పాత ఎన్డీయే గూటికి ఎగిరిపోడానికి ఒక
తలుపు తెరిచిపెట్టుకుని ఉన్నాడని సమాచారం.
ప్రతిపక్ష దళాన్ని అయోమయానికి గురిచేస్తున్న
ఇండియా కూటమిలోని మరో అగ్రనేత శరద్ పవార్. ముంబైలో ఇండియా కూటమి సమావేశాలకు మూణ్ణాలుగు
రోజులే ఉందన్న తరుణంలో కూడా… అజిత్ పవార్ ఇంకా తమ పార్టీ నాయకుడే అనీ, తమ పార్టీలో
ఎలాంటి చీలికా లేదనీ శరద్ పవార్ కుండ బద్దలుగొట్టి మరీ చెప్పడం ఇండియా శిబిరంలో
గందరగోళాన్ని సృష్టించింది. పార్టీని నిట్టనిలువునా చీల్చి, 40మంది ఎమ్మెల్యేలను
తనతో తీసుకువెళ్ళిపోయిన అజిత్ పవార్… తనకు ఉపముఖ్యమంత్రి పదవి, తన తోటివారిలో
8మందికి మంత్రిపదవులూ తీసుకెళ్ళిపోయారు. శరద్ పవార్, అజిత్ పవార్ ఇద్దరి మధ్యా తరచుగా
భేటీలు జరుగుతున్నాయని సమాచారం. ఇండియా కూటమిని వదిలేసి బీజేపీ కూటమిలో చేరమని
అజిత్ పవార్ దౌత్యం చేస్తున్నాడట. అప్పుడు
ఆర్థికంగానూ, స్థాయిలోనూ ఒక ఉన్నత స్థానానికి వెళ్ళవచ్చని చెవినిల్లు కట్టుకుని
పోరుతున్నాడని తెలుస్తోంది. ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడిన తర్వాత కూడా శరద్ పవార్
ప్రధాని నరేంద్ర మోదీతో వేదిక పంచుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ వద్దు వద్దని మొత్తుకున్నా,
పుణేలో లోకమాన్య తిలక్ పురస్కారం పేరిట ప్రధానమంత్రికి పురస్కారం ఇచ్చే
కార్యక్రమానికి శరద్ పవార్ ప్రత్యేకంగా హాజరయ్యారు. శరద్ పవార్ తన పేకముక్కలను
ఇప్పటికిప్పుడు బైటకు చూపించక పోతుండవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి తనకు
తగిన రాజకీయ పునరావాస హామీ ఇస్తే, ద్రోహి
అన్న ముద్ర వేసినా శరద్ పవార్ పెద్దగా పట్టించుకోడు.
బిహార్, మహారాష్ట్ర… ఈ రెండు రాష్ట్రాల నుంచి
మొత్తం 104 మంది లోక్‌సభ సభ్యులున్నారు. అక్కడ ఇండియా కూటమిలో పగుళ్ళు
వస్తున్నాయంటే అది బీజేపీయేతర కూటమికి మంచి శకునం కాదు. ప్రస్తుతానికి
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఒక్కరే
పెద్దగా ఏం మాట్లాడడం లేదు. దానికి కారణం సొంత రాష్ట్రంలోని సమస్యలనుకోండి,
ఏదేమైనా ఆమె ఇప్పటికైతే ప్రతిపక్ష ఐక్యతకు వ్యతిరేకంగా నోరెత్తలేదు. అలా అని ఆమెను
నమ్మడానికీ వీల్లేదు. ప్రతిపక్షం నుంచి ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఉండాలన్న ఆవిడ
కోరిక రహస్యమేమీ కాదు. తనకు కన్వీనర్ పదవి ఇవ్వకపోతే, ఇండియా కూటమి కార్యకలాపాల్లో
మమతా బెనర్జీ అంత ఉత్సాహంతో పాల్గొనే అవకాశాలేమీ లేవు.
ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్‌ది ప్రత్యేక
ఎజెండా. రాజకీయంగా విస్తరించడమే ఆ పార్టీ ప్రస్తుత వైఖరి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్
బరిలోకి నేరుగా దిగారు. ఇంక త్వరలో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా అడుగు పెట్టడం
ఖాయం. మోదీ ప్రభుత్వపు ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించాలి అనే ఒక
షరతు మీద ఇండియా కూటమిలో చేరింది ఆమ్ ఆద్మీ పార్టీ. అంతే తప్ప, కాంగ్రెస్‌కు మళ్ళీ
పాత వైభవం రావడానికి తాము సహకరించడానికి ఆప్ ఎంతమాత్రం సిద్ధంగా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోనూ, పంజాబ్‌లోనూ పోటీ చేయకుండా ఉండాలని అరవింద్
కేజ్రీవాల్ పట్టు పడుతున్నాడు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ
పార్టీ పోటీ చేస్తామంటున్నట్టే, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో తామూ పోటీ చేయాలని
ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోందట. అఖిలేష్ యాదవ్ అయితే, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో
ఉన్న మధ్యప్రదేశ్ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్ధులను ఇప్పటికే ప్రకటించేసాడు.
డజనుకు పైగా సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేస్తుందంటే, రాబోయే ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లను కోల్పోతుందన్న మాటే.
ఇవన్నీ చూస్తే, ఇండియా కూటమి సభ్య పక్షాలు
రాష్ట్రస్థాయిలో సహకరించుకోడం గురించి ఏమాత్రం ఆసక్తిగా లేరు కానీ తమతమ బలమైన
స్థానాల్లో లోక్‌సభ సీట్ల కోసం బేరాలాడుకోడానికి పాచికలు వేస్తున్నారని అర్ధమవుతోంది.
ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ పార్టీలు కాంగ్రెస్ నుంచి తాము ఎన్ని లోక్‌సభ సీట్లు
లాక్కోగలం అన్న విషయం గురించే ఆలోచిస్తున్నాయి. అంతేతప్ప, ఇండియా కూటమికి
కాంగ్రెస్ నేతృత్వాన్ని బలపరిచేందుకు ఆ పార్టీలు సిద్ధంగా లేవు.
మరోవైపు, కాంగ్రెస్ నేతల హడావుడి ఏమీ తక్కువ
లేదు. ఆ పార్టీలో కొద్దో గొప్పో సీనియారిటీ ఉన్న ప్రతీ నాయకుడూ మోదీకి తనే
పోటీదారుగా భావిస్తున్నాడు, తన రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిపించగలనని
చెప్పుకుంటున్నాడు. ఇలాంటి కాంగ్రెస్ మార్కు రాజకీయాలు నితీష్ తత్వానికి సరిపడేవి
కావు. కానీ, ఇండియా కూటమికి కన్వీనర్ అనే ట్యాగ్ లేకపోతే బిహార్‌లో తన పట్టు
కోల్పోతానని భయపడుతున్నాడు. మరోవైపు ప్రాంతీయ నాయకుల ఆశలూ ఆకాంక్షల కొట్లాటల మధ్య
రాహుల్ గాంధీని ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్ధిగా చేసుకోవాలని కాంగ్రెస్
కోరిక.
ఇలా, ఒకరినొకరు అనుమానించుకునే
మెదళ్ళు, ఎవరికి వారి సొంత ఎజెండాలతో బీజేపీయేతర 26 పార్టీలు ముంబై వెడుతున్నాయి. అందుకే
ముంబై సమావేశం అంత ఆహ్లాదకరంగా, సరళంగా ఏమీ ఉండదు. నిర్దిష్టమైన ఫలితం ఏమీ
లేకుండా, జైపూర్‌లో మళ్ళీ కలుద్దామని చేతులు ఊపుకుని వెళ్ళిపోవచ్చు.
వ్యాసం ఆంగ్లమూలం: డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు, రిటైర్డ్ ప్రొఫెసర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు