ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రపతి భవన్‌ను కూడా రాజకీయాల్లోకి లాగాడని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందరేశ్వరి ధ్వజమెత్తారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి భవన్లో రూ.100 ఎన్టీఆర్ స్మారక చిహ్నం విడుదల కార్యక్రమంలో కుటుంబ సభ్యులంతా కలసిన విషయానికి కూడా రాజకీయ రంగు పులమడం అంటే రాష్ట్రపతి భవన్‌కు రాజకీయ రంగు పూయడమేనని ఆమె విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, రాష్ట్రపతి హోదాను కించపరిచారని పురందరేశ్వరి తప్పుపట్టారు.
శంఖనాధం పేరుతో రాష్ట్ర బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టినట్టు పురందరేశ్వరి వివరించారు. ముందుగా జిల్లా స్థాయిలో ఉన్న సోషల్ మీడియా కో ఆర్డినేటర్లకు రెండు రోజుల పాటు విజయవాడలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఆ తరవాత జిల్లా, మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలుంటాయన్నారు.
దేశంలో ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలోని ప్రతి ఇంటి నుంచి చిటికెడు మట్టి సేకరించే కార్యక్రమం వివరాలను పురందరేశ్వరి ప్రకటించారు. గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి చిటికెడు మట్టి, నగరాలు, పట్టణాల్లో చిటికెడు బియ్యం గింజల సేకరణ కార్యక్రమం సెప్టెంబరు 1 నుంచి 15 వరకు మొదటి విడతలో జరుగుతుందన్నారు. అక్టోబరు 3 నుంచి 11 వరకు రెండో దశ జరుగుతుందని పురందరేశ్వరితెలిపారు. ఇలా దేశంలోని ప్రతి ఇంటి నుంచి సేకరించిన మట్టిని ఢిల్లీలో అమృత వనంలో ఉంచుతారని ఆమె వివరించారు. గడచిన తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ అధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఆమె గుర్తు చేశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు