‘‘ప్రపంచ
సంస్కృత దివస్’’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి
ఒక్కరూ ఒక సంస్కృత వాక్యాన్ని రాసి ఇతరులతో పంచుకుని సంస్కృత భాషా వేడుకల్లో భాగం
కావాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మం మూలాలున్న ప్రాచీన భాష వైభవాన్ని చాటిచెప్పే సంబరాల్లో
పాల్గొని కనీసం ఒక వాక్యాన్ని అయినా సంస్కృతంలో రాసి ఇతరులకు పంపాలని కోరారు.
‘‘ జీ-20
సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని.. విదేశీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ
సదస్సులో పాల్గొని మన అత్యుత్తమ సంస్కృతి గురించి తెలుసుకుంటారని’’ సంస్కృత భాషలో
ఓ సందేశాన్ని రాసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
శ్రావణ
పౌర్ణమి నాడు ప్రపంచంలోనే పురాతన, దేవ భాషగా పరిగణించబడుతున్న సంస్కృత భాషా
దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అనవాయితీగా వస్తోంది. సంస్కృత
దినోత్సవం వేడుకలను 1969లో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ప్రఖ్యాత సంస్కృత
పండితుడు పాణిని, భాష అభివృద్ధికి అందించిన సేవలకు గౌరవంగా ఆయన జన్మదినమైన
శ్రావణపౌర్ణమి నాడు ఈ వేడుకలు నిర్వహించుకుంటాం.
ఆగస్టు
27న ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగంలో కూడా సంస్కృత భాష నేర్చుకునేందుకు ప్రజల్లో
ఆసక్తి పెరుగుతుండటంపై హర్షం వ్యక్తం
చేశారు. ప్రపంచంలోని
పురాతన భాషల్లో సంస్కృతం ఒకటని, అనేక ఆధునిక భాషలకు మూలమని మోదీ పేర్కొన్నారు.
దేవనాగరి లిపి వ్యాకరణానికి ప్రసిద్ధి చెందినదని, ప్రాచీనత, శాస్త్రీయత మేళవింపైన
సంస్కృతం చరిత్ర అద్వితీయమైనదని కొనియాడారు.