వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుందంటారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర కూడా చిన్నగా మొదలై ప్రభంజనంలా మారింది. ఒక్కో చినుకు తోడై వరదలా మారినట్టు యువగళం, ప్రజాగళమైంది. లోకేశ్ పాదయాత్ర చేయలేడు, మధ్యలోనే ఆపేస్తాడని విమర్శించిన వారి నోళ్లు మూయించాడు. ఒక్కో అడుగు వేసుకుంటూ బడుగు బలహీన పేద వర్గాల కష్టాలను వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ మీకు నేనున్నానంటూ సాగిన యువగళం పాదయాత్ర పోలవరం నియోజకవర్గంలో ప్రవేశించి, 200 రోజుల మైలు రాయిని చేరింది.
యువగళం సాగిందిలా…
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం గురువారం నాటికి 200 రోజుల మైలురాయిని చేరుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన యువగళం ప్రజాగళంగా మారి 77 నియోజకవర్గాల్లో, 2710 కిలోమీటర్లను పూర్తిచేసుకుంది. యువగళం పాదయాత్రలో 185 మండలాలు, 65 మున్సిపాలిటీలు, 1675 గ్రామాల మీదగా నారా లోకేశ్ యాత్ర చేశారు. రాయలసీమ జిల్లాల్లోనే 124 రోజులు, 44 నియోజకవర్గాల్లో 1587 కి.మీ పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. 200 రోజుల్లో 64 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. 132 చోట్ల ప్రజలతో మమేకం అవుతూ ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు. 8 రచ్చబండ కార్యక్రమాలు, 10 ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. ప్రజల నుంచి 3813 వినతులు స్వీకరించారు. సగటున రోజుకు 12.5 కి.మీ పాదయాత్ర చేశారు.
ఏ జిల్లాలో ఎన్ని రోజులు
కుప్పంలో మొదలైన పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో సాగింది. 45 రోజులు 577 కి.మీ పాదయాత్ర చేశారు. అక్కడ నుంచి నారా లోకేశ్ చేపట్టిన యువగళం అనంతపురంలో ప్రవేశించింది. జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 23 రోజులు, 3030 కి.మీ పాదయాత్ర చేశారు. కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు, 40 రోజులపాటు 507 కి.మీ నడిచారు. ఇక కడప జిల్లాలో 7 నియోజకవర్గాల్లో యాత్ర సాగింది. 16 రోజుల పాటు 200 కి.మీ పాదయాత్ర చేశారు. నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. లోకేశ్ నెల్లూరు జిల్లాలో 31 రోజులు 459 కి.మీ పాదయాత్ర చేశారు. గుంటూరు జిల్లాలో 7 రోజులు,
కృష్ణాలో 8 రోజులు పాదయాత్ర చేసి పశ్చిమలో ప్రవేశించారు. గత నాలుగు రోజులుగా పశ్చిమగోదావరి జిల్లాలో 80 కి.మీ పాదయాత్ర పూర్తి చేసి పోలవరం నియోజకవర్గంలో ప్రవేశించారు.
ప్రజల అవసరాలే హామీలుగా…
సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుంటోన్న నారా లోకేష్, ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీ ఇస్తున్నారు. ఆ హామీకి సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రజల అవసరాలే హామీలుగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలను అమలు చేస్తానని లోకేశ్ ప్రజలకు భరోసా కల్పించారు. పాదయాత్రలో హంద్రీనీవా రైతుల సమస్యలు, చింతలపూడి ఎత్తిపోతల, మిడతూరు, వరికశపూడిశెల ఎత్తిపోతల పథకాలు, గుండాల ప్రాజెక్టు, ఆక్వా రైతుల కష్టాలు, ఉద్యాన రైతుల సమస్యలు, చేనేతల ఇబ్బందులు తెలుసుకుని వారికి పలు హామీలిచ్చారు.
వృత్తుల వారీగా హామీలు
ఏ వృత్తి చేసే వారికి ఆయా సమస్యలుంటాయి. అవన్నీ ప్రజల నుంచి తెలుసుకుని వాటి పరిష్కారానికి లోకేశ్ హామీలిచ్చారు. కులాల వారీగా, వృత్తుల వారీగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రైతులు, చేనేతలు, యువత, మహిళలు, దళితులు, ముస్లిం, బీసీ, గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యల పరిష్కారానికి భరోసా కల్పించారు. ప్రజలు అడుగుతున్న సమస్యలను తాము అధికారంలోకి వచ్చాక ఎలా పరిష్కరిస్తామో లోకేశ్ వివరించే ప్రయత్నం చేశారు.
అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు భరోసా
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధాని నిర్మాణం మొదలవుతుందని నారా లోకేశ్ భూములిచ్చిన రైతులకు భరోసా కల్పించారు. మొదటి వంద రోజుల్లోనే విశాఖకు ఐటీ పరిశ్రమలు తీసుకువస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. కడపలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. వెనుకబడిన కులాలైన బీసీలకు అండగా ఉండేందుకు రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు.
రైతులకు సాగునీరు, గిట్టుబాటు ధరలు, రాయితీ పరికరాలు, రుణాలపై వడ్డీ రాయితీ హామీ ఇచ్చారు. చేనేతను ఆదుకునేందుకు జీఎస్టీ రద్దు హామీ ఇచ్చారు. తన పాలనలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, తెచ్చిన పరిశ్రమలు, యువతకు కల్పించిన ఉద్యోగాలను ప్రజలకు గుర్తుచేశారు. ప్రతి రోజూ తనను చూడాలని వచ్చిన లక్షలాది మందితో సెల్ఫీలు దిగారు. అదే సమయంలో ప్రభుత్వం వదిలేసిన ప్రాజెక్టుల వద్ద ఫోటోలు దిగి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్రే…
టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అనేక అడ్డంకులు, గొడవలు సృష్టించారు. అధికార వైసీపీ నేతల అరాచకాలను అడ్డుకుంటూ లోకేశ్ ముందడుగు వేశారు. ఇప్పటికే లోకేశ్‌పై 23 కేసులు బనాయించారు. కొన్ని చోట్ల రాళ్లు రువ్వారు, కోడిగుడ్లు విసిరారు, ఫ్లెక్సీలు చింపారు, పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. అయినా ఎక్కడా వెరవకుండా లోకేశ్ ముందుకు సాగి 200 రోజులు పూర్తి చేసుకున్నారు. లోకేశ్ పాదయాత్ర టీడీపీ బలోపేతానికి, ప్రజల కష్టాల పరిష్కారానికి ఉపయోగపడుతుందా? లేదా? అనే విషయాన్ని ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు