కావేరి జల వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. కర్ణాటకలోని కృష్ణరాజసాగర్ ప్రాజెక్టు నుంచి తమిళనాడు తాగునీటి అవసరాలకు 5 వేల క్యూసెక్కుల జలాలను దిగువకు వదిలారు. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (CWMA) నిర్ణయం మేరకు జలాలను తమిళనాడుకు విడుదల చేశారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర రైతులు గురువారం కేఆర్ఎస్ రిజర్వాయర్ వద్ద ధర్నాకు దిగారు. తమిళనాడుకు తాగునీరు నిలిపివేసి తమకు సాగునీరు ఇవ్వాలంటూ మాండ్యా కలెక్టరేట్ వద్ద రైతులు బుధవారం అర్థరాత్రి వరకూ నిరసన తెలిపారు.
తమిళనాడు సరిహద్దు బిల్లిగుండుల వద్ద ప్రతీరోజూ 5వేల క్యూసెక్కుల వరదనీరు ఉండేలా సెప్టెంబరు 12 వరకు నీటిని విడుదల చేయాలని సీడబ్ల్యుఎంఏ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీడబ్ల్యుఎంఏ తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కావేరీ పరీవాహక ప్రాంతంలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయని, నది మీద ఉన్న రిజర్వాయర్లలో తాగడానికి సరిపడా నీరు కూడా లేదని చెబుతూ… కర్ణాటక ప్రభుత్వం సీడబ్ల్యుఎంఏ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది.
ఆగష్టు 14 నుంచి నెలాఖరు వరకు ప్రతి రోజూ 24000 క్యూసెక్కుల జలాలను కర్ణాటక ప్రాజెక్టుల నుంచి విడుదల చేయాలని తమిళనాడు అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కర్ణాటక రివ్యూ పిటీషన్ వేసింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ న్యాయ నిపుణులతో చర్చించేందుకు ఢిల్లీ చేరుకున్నారు. దీనిపై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగే అవకాశముందని డికె శివకుమార్ వెల్లడించారు..తాము 3 వేల క్యూసెక్కుల నీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, తమిళనాడు ప్రభుత్వం 24 నుంచి 25 టీఎంసీలు డిమాండ్ చేస్తోందని శివకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
కావేరి జలాల విడుదల విషయంలో సీడబ్ల్యుఎంఏ సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని తమిళనాడు జలవనరుల మంత్రి దురై మురుగన్ వ్యాఖ్యానించారు. నదిలో జలాలు పుష్కలంగా ఉన్నప్పుడు ఎలా పంచుకోవాలో సూచించారు, కానీ కరవు రోజుల్లో, ఉన్న కొద్ది జలాలనూ ఎలా పంచుకోవాలో స్పష్టత లేదని మురుగన్ తప్పు పట్టారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు