లద్దాఖ్ ఉత్తరభాగంలోని దెప్సాంగ్
మైదానానికి తూర్పున 60 కిలోమీటర్ల ఎగువన కొండ ప్రాంతంలో చైనా సైన్యాలు సొరంగాలు తవ్వుతున్నాయి.
అక్కడ తమ సైన్యం కోసం, ఆయుధాలు నిల్వ చేయడం కోసం చైనా బంకర్లు, షెల్టర్లు
నిర్మిస్తోంది.
చైనా నిర్మాణాలు చేపట్టిన భూభాగం వాస్తవాధీన
రేఖకు తూర్పుదిక్కున అక్సాయ్ చిన్ ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతం చారిత్రకంగా భారత్
అంతర్భాగమే అయినప్పటికీ చైనా తమ భూభాగంగా చెప్పుకుంటోంది.
అమెరికాకు చెందిన ఉపగ్రహ ఛాయాచిత్రాల
సంస్థ మాక్సార్ తీసిన చిత్రాలు చైనా అరాచకాన్ని బహిర్గతం చేసాయి. అక్కడ నదీలోయకు
రెండువైపులా ఉన్న పర్వత ప్రాంతాల్లో కనీసం 11చోట్ల నిర్మాణాలు చేపట్టడం ఆ
చిత్రాల్లో స్పష్టంగా తెలుస్తోంది. భారీ నిర్మాణాలకు ఉపయోగించే ఎర్త్ మూవింగ్
మెషీన్స్ పెద్దసంఖ్యలో తిరుగుతుండడం కూడా ఆ చిత్రాల ద్వారా వెల్లడయింది.
ఆ ప్రాంతంలో భారత వైమానిక దళానికి ఉన్న ఆధిక్యాన్ని తట్టుకోలేకనే చైనా అక్సాయ్ చిన్ ప్రాంతంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని
అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
‘‘అక్సాయ్ చిన్‌లో భారత వైమానిక దళానికి
పట్టు ఉంది. దాన్ని అధిగమించడానికే చైనా ఈ ప్రయత్నాలు చేస్తోంది. సరిహద్దులకు
అత్యంత చేరువలో భూగర్భ సొరంగాలు తవ్వడం, భూమి మీద భారీ నిర్మాణాలు చేపట్టడం వంటి
చర్యల ద్వారా పైచేయి సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాలను
విశ్లేషిస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది’’ అని ఇంటెల్ ల్యాబ్‌కు చెందిన
డామియెన్ సైమన్ వ్యాఖ్యానించారు.
‘‘గల్వాన్ ఘర్షణ తర్వాత భారత సైన్యం తన
బలాన్ని సమర్థంగా పెంచుకుంది. ప్రత్యేకించి లాంగ్ రేంజ్ ట్యూబ్ అండ్ రాకెట్
ఆర్టిలరీని బలోపేతం చేసుకుంది. దాన్ని తప్పించుకోడానికే పర్వత ప్రాంతాల్లో భూగర్భ
సొరంగాలు తవ్వుతున్నారు. టిబెట్‌లో చైనా చొరబాటును అడ్డుకునేలా భారత సైన్యం
ప్రమాదకరంగా మారడంతో ఆ ముప్పును తప్పించుకునేందుకే పటిష్టమైన షెల్టర్లు, బంకర్లు,
సొరంగాలు భారీ ఎత్తున నిర్మించడం, రహదారులను వెడల్పు చేయడం వంటి పనులు చేస్తోంది’’
అని, భారతదేశానికి చెందిన ప్రముఖ డ్రోన్ కంపెనీ న్యూ స్పేస్ రిసెర్చ్ అండ్
టెక్నాలజీస్ సీఈఓ సమీర్ జోషి వివరించారు.
లద్దాఖ్ ప్రాంతంలో భారత వైమానిక దళం పలు ఎయిర్‌బేస్‌లను
నిర్వహిస్తోంది. శ్రీనగర్, అవంతిపురా ఎప్పటినుంచో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు ఫైటర్బేస్లుగా
ఉన్నాయి. పాంగాంగ్ సరస్సు సమీపంలో న్యోమా దగ్గర ఎయిర్ ల్యాండింగ్ గ్రౌండ్ ఉంది.
అక్కడి రన్‌వేని మరింత విస్తరించడానికి భారత వైమానిక దళం సిద్ధంగా ఉంది. అది పూర్తయితే
చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖకు కేవలం 50 కిలోమీటర్ల కంటె తక్కువ
దూరంలోనుంచే ఫైటర్ విమానాలను ప్రయోగించగల సామర్థ్యం భారత్‌కు కలుగుతుంది.
‘‘ఒకవేళ పూర్తిస్థాయి సైనికచర్య లాంటి
పరిస్థితి తలెత్తితే సైనిక, వైమానిక దాడులు చేయడానికి వీలుగా లద్దాఖ్‌లో తన
బలాన్ని పెంచుకోడానికే చైనా ఈ నిర్మాణాలు చేస్తోందన్న సంగతి స్పష్టమవుతోంది. అక్కడ
భూగర్భంలో గోదాములు, ఉపరితలంపైన కమాండ్ పొజిషన్లు నిర్మిస్తుండడం కనిపిస్తోంది.
దానివల్ల చైనా తమ కార్యకలాపాలను విస్తరించగలదు. లద్దాఖ్ ప్రాంతంలో సాయుధ ఘర్షణ
తలెత్తితే భారత సైనికులు అక్కడికి చేరకుండా నిలువరించగలదు’’ అని ‘ఫోర్స్ అనాలసిస్’లో
చీఫ్ మిలటరీ ఎనలిస్ట్ అయిన సిమ్ టాక్ విశ్లేషించారు.
డిసెంబర్ 2021లో ఇదే స్థలంలో నదీపరీవాహక
ప్రాంతం వెంబడి పెద్దసంఖ్యలో గట్లు, రివెట్మెంట్లు నిర్మించడాన్ని గుర్తు చేసుకుంటే,
లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత చైనా దేశాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు చైనా
బలగాలు భారత్‌లోకి చొచ్చుకుని రావడానికి ఈ ప్రాంతమే కీలకమైన స్టేజింగ్ పాయింట్‌గా
నిలిచింది. సరిగ్గా అదే ప్రాంతంలో ఇప్పుడు చైనా భారీ స్థాయిలో నిర్మాణాలు చేపడుతోంది.
ఇక్కడ కడుతున్న బంకర్లను పరిశీలిస్తే,
వాటిని కొండప్రాంతంలో పటిష్టంగా నిర్మిస్తున్నారు. అంతే కాదు, దాడి జరిగినప్పుడు
దాని ప్రభావం ఏమాత్రం లేకుండా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్ ఏరియాలను డిజైన్ చేసారు.
ఆగస్టు 18 నాటి తాజా చిత్రాలను చూస్తే,
లోయప్రాంతాన్ని ఆనుకుని 4 రీఇన్ఫోర్స్డ్ పెర్సొనెల్ బంకర్లు, 3 సొరంగాలు,
నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. మళ్ళీ ఒక్కొక్క ప్రదేశంలో కొండ మీదకు 2 నుంచి 5
మార్గాలు నిర్మిస్తున్నారు. చాలా ప్రదేశాల్లో భారీ ఎర్త్ మూవింగ్ యంత్రాలు కనిపిస్తున్నాయి.
లోయ మీదుగా వెళ్ళే రహదారిని భారీ వాహనాలు వెళ్ళడానికి వీలుగా వెడల్పు చేసారు.
అలాగే, బంకర్ల మీద నేరుగా దాడి చేసినా ఎలాంటి ప్రభావం లేకుండా ఉండేందుకు వాటి
చుట్టూ ఉన్న భూభాగాన్ని మెరక చేసారు. ఒకవేళ దాడి జరిగితే దాని ప్రభావం లేకుండా
తప్పించుకోడానికి వీలుగా ఎంట్రీ, ఎగ్జిట్ ఏరియాస్‌ని ప్రత్యేకమైన ఫోర్క్ డిజైన్‌లో
నిర్మించారు.
‘‘వాస్తవాధీన రేఖకు అత్యంత చేరువలో
అక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా శాశ్వత ప్రాతిపదికన బంకర్లు, ఇతర నిర్మాణాలు చేపట్టడం
వారి మొండివైఖరికి నిదర్శనం. భారత్‌తో సైనిక ఘర్షణ వైఖరిని ముగించాలన్న ఉద్దేశం
చైనాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. నిజానికి అక్సాయ్ చిన్‌లో ఈ నిర్మాణాలు తూర్పు
లద్దాఖ్ నుంచి అరుణాచల్-టిబెట్ సరిహద్దు వరకూ ఉన్న ఇతర సరిహద్దు ప్రాంతాల్లోకి
విస్తరించేలా కొత్త శాశ్వత సైనిక నిర్మాణాలు చేపడుతోందని స్పష్టంగా
తెలియజేస్తున్నాయి’’ అని, చైనా వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లానీ విశ్లేషించారు.
అక్సాయ్ చిన్‌లోని నదీలోయ ప్రాంతంలో
డిసెంబర్ 2021 నాటి ఉపగ్రహ ఛాయాచిత్రాలను పరిశీలిస్తే, అప్పట్లో ఆ ప్రాంతంలో
పెద్దగా నిర్మాణాలేమీ లేవు. కానీ ఆగస్టు 2023 నాటికి పరిస్థితి పూర్తిగా
మారిపోయింది.
నిజానికి వాస్తవాధీన రేఖ వెంబడి
సంక్షోభాన్ని నివారించడానికి భారత్ చైనాలు నో పెట్రోల్ జోన్స్ ఏర్పాటు చేయాలని
నిర్ణయించుకున్నాయి. కానీ ఎత్తయిన ప్రదేశంలో ఉన్న దెప్సాంగ్ మైదానంలో 2020 కంటె
ముందే ఉన్న మన పెట్రోలింగ్ జోన్స్‌లోకి సైతం వెళ్ళకుండా చైనా నిలువరిస్తూండడం
భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
ఇరు సైన్యాల మధ్యా చర్చలు కొనసాగుతూనే
ఉన్నాయి. కానీ, వాస్తవాధీన రేఖకు అత్యంత చేరువలో సంక్లిష్టమైన మిలటరీ కాంప్లెక్స్‌లు
నిర్మించడానికి చైనా భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతుండడాన్ని గమనిస్తే, దాని
దురుద్దేశాలు ఇట్టే సుస్పష్టమవుతున్నాయి.
మే 2020లో ఈశాన్య లద్దాఖ్‌లో
వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో చైనా సైనికులు చొరబడడానికి ప్రయత్నించారు.
వారిని భారత సైనికులు ప్రతిఘటించారు. 1962 యుద్ధం తర్వాత భారత్ మీద చైనా చేసిన
అత్యంత భయంకరమైన దాడులు అవే. 2020 జూన్ 15న గల్వాన్ లోయలో బాహాబాహీ ఘర్షణల్లో భారతదేశానికి
చెందిన 20మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారత సైనికులు కనీసం 38మంది చైనా
సైనికులను హతమార్చారు. అయితే చైనా అధికారికంగా తమ సైనికులు నలుగురు మాత్రమే
చనిపోయారని ప్రకటించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు