ఎస్సై ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. తుది రాత పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు 14, 15వ తేదీల్లో తుది పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. తుది పరీక్షలు విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లో నిర్వహించనున్నట్టు
ఏపీ పోలీస్ నియామక మండలి ప్రకటించింది. పీఎంటీ, పీఈటీ పరీక్షా ఫలితాలు వెల్లడించిన తరవాత హాల్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని పోలీస్ నియామక మండలి ఛైర్మన్ అతుల్ సింగ్ ప్రకటించారు.
తుది పరీక్షల్లో నాలుగు పేపర్లుంటాయి. రెండు పేపర్లు డిస్క్రిప్టివ్, మరో రెండు ఆబ్జెక్టివ్. అక్టోబరు 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 1, 2గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 డిస్క్రిప్టివ్ పరీక్షలు నిర్వహిస్తారు. అక్టోబరు 15న రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.
మొత్తం 411 ఖాళీలను ఈ పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 19న నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 57,923 మంది అర్హత సాధించారు. వీరిలో 56,130 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పంపారు.