చంద్రయాన్
-3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టినప్పటి నుంచి రోజుకో
కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. చంద్రుడిపై వాతావరణ పరిస్థితుల్లో మార్పులు
అంచనా వేయడంతోపాటు దక్షిణ ధ్రువంపై నిక్షేపాలను కూడా గుర్తించింది. ఇస్రో కమాండ్స్
కు తగ్గట్టుగా తన దిశను మార్చుకుంటున్న ప్రజ్ఞాన్ రోవర్, నెలరాజుపై చక్కర్లు కొడుతోంది.
తాజాగా
ప్రజ్ఞాన్ రోవర్ తనను మోసుకెళ్ళిన ల్యాండర్‌ను ఫొటో తీసి, ఇస్రోకు చేరవేసింది.
రోవర్ తీసిన రెండు ఫొటోలను ఇస్రో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రజ్ఞాన్ కు
అనుసంధానించిన నావిగేషన్ కెమెరా ద్వారా ఈ
ఫొటోను తీసి పంపినట్లు అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. రోవర్ తీసిన రెండు ఫొటోలను ‘స్మైల్ ప్లీజ్’ అనే
క్యాప్షన్ తో ఇస్రో షేర్ చేసింది.
చంద్రయాన్-3
కోసం లేబరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ అనే సంస్థ నావిగేషన్ కెమెరాలను
తయారు చేసింది. చంద్రుడిపై
అత్యధికంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నట్లు గుర్తించిన ప్రజ్ఞాన్, చంద్రుడి
లోపలికి వెళ్ళేకొద్దీ మైనస్ 10 డిగ్రీలు ఉన్నట్లు గుర్తించింది. రోవర్ పంపిన తాజా
సమాచారంతో శాస్త్రవేత్తల అంచనాలు తారుమారు అయ్యాయి. జాబిల్లిపై ఇంత స్థాయిలో వేడి
వాతావరణం ఉంటుందని ఏ శాస్త్రవేత్త కూడా ఇప్పటివరకు అంచనా వేయలేకపోయారు.
చందమామపై
పలు నిక్షేపాలను రోవర్ గుర్తించింది. హైడ్రోజన్ ఆనవాళ్ల కోసం జాబిల్లి
ఉపరితాలాన్ని జల్లెడ పడుతోంది. రోవర్
తన పరిశోధనలో భాగంగా అతిపెద్ద అవరోధాన్ని సోమవారం నాడు అధిగమించింది. తన మార్గంలో
అడ్డుగా ఉన్న నాలుగుమీటర్ల వ్యాసం ఉన్న గోతిని గుర్తించింది. అనంతరం ఇస్రో పంపిన
కమాండ్స్ తో దిశ మార్చుకుని ప్రయాణిస్తోంది. రోవర్ జీవిత కాలం 14రోజులు ఉండేలా
శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. ఆగస్టు 23న ల్యాండర్ నుంచి చంద్రుడి దక్షిణ
ధ్రువంపై అడుగుపెట్టిన రోవర్ సమయంతో పోటీ పడుతూ పనిచేస్తోంది. చంద్రుడిపై ఒక
లూనార్ డే అంటే భూమిపై 14 రోజులకు సమానం.