జాతీయ పరిశోధనా సంస్థ ఎన్ఐఏ తనకు నోటీసులు జారీ
చేసిందంటూ వచ్చిన వార్తలపై తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పందించారు. ఆ
వార్తల్లో ఎలాంటి నిజంలేదంటూ వాటిని ఖండించారు. ఆ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన
విడుదల చేశారు.
డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తన మాజీ పీఏ గురించి
విచారించేందుకు వరలక్ష్మిని ఎన్ఐఏ అధికారులు కొచ్చిలోని కార్యాలయానికి
హాజరుకావాలని ఆదేశించారంటూ తమిళ మీడియా కథనాలు వెలువడ్డాయి. వరలక్ష్మి దగ్గర
కొన్నాళ్ళు పనిచేసిన ఆదిలింగం అనే వ్యక్తికి డ్రగ్స్, ఆయుధాల
సరఫరాలో అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
అతడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చిన
మొత్తాన్ని అతను సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు గుర్తించారు. ఈ వివరాల కోసం
వరలక్ష్మికి సమన్లు జారీ చేసి, ఆమె వాంగ్మూలం తీసుకోనున్నారు… అంటూ కథనాలు
వెలువడ్డాయి. ఆ విషయం వరలక్ష్మి వరకు చేరడంతో ఆమె స్పష్టత ఇచ్చారు.
ఆదిలింగం తన దగ్గర ఫ్రీలాన్స్ మేనేజరుగా సుమారు మూడేళ్ళు
పనిచేసాడని, అతడితో ప్రస్తుతం ఎలాంటి కమ్యూనికేషన్ లేదని వరలక్ష్మి
వెల్లడించారు. అతని గురించి వివరాలు అడగడానికి ఎన్ఐఏ తనకు ఎలాంటి నోటీసులూ
ఇవ్వలేదని వరలక్ష్మి స్పష్టం చేసారు.