రాఖీ పండుగ అనగానే…
అన్నలు లేదా తమ్ముళ్ళ చేతికి అందమైన రాఖీ కట్టి, వారి నుంచి డబ్బులో కానుకలో తీసుకునే
పండుగగా మాత్రమే ఈరోజుల్లో మనకు తెలుసు. కానీ, రాఖీ పండుగ అసలైన తత్వం వేరు. అది
త్యాగభావనను నేర్పుతుంది. సమాజానికి మనం ఏం చేయగలమో గుర్తు చేస్తుంది.
దేవ దానవ సంగ్రామానికి
ఇంద్రుడు సంసిద్ధుడవుతున్నాడు. ఆ సమయంలో భార్య శచీదేవి పూజామందిరం నుంచి ఒక కాషాయ సూత్రాన్ని
తీసుకొచ్చింది. భర్త చేతికి కంకణంలా కట్టింది. ఆ రక్షా బంధనం ప్రభావంతో ఇంద్రుడు
అరివీర భయంకరుడై, దానవాంతకుడై యుద్ధంలో విజయం సాధించాడు. నాటి నుంచీ, ఎవరైనా సరే,
తాము చేపట్టిన పనిలో విజయం సాధించడానికి రక్షాబంధనాన్ని ధరించడం ఆనవాయితీ అయింది.
చాలామంది శచీదేవి కోరిక
స్వార్థం అనుకుంటారు. కానీ నిజానికి ఆమె తన భర్త క్షేమం కోరుకున్నది అఖిల లోక
సంక్షేమం కోసమే. దేవ దానవ యుద్ధంలో రాక్షసులు ఓడిపోతేనే ముల్లోకాలకూ వారి పీడ
విరగడ అవుతుంది. ఆ మహత్కార్యాన్ని సాధించడం కోసమే తన భర్త ప్రమాదంలోకి అడుగు
పెడుతున్నా చిరునవ్వుతో సహించిందామె. సర్వజనుల మంగళం కోసం చేసిన యుద్ధంలో సత్యం,
ధర్మాల వైపు ఉన్న ఇంద్రుడికి విజయం చేకూరడానికి శచీదేవి కట్టిన రక్షాబంధనమే
దోహదకారిగా నిలిచింది.
కొన్ని పురాణాలలో శచీదేవి
స్థానంలో దేవగురువు బృహస్పతి ఇంద్రునికి రక్ష కట్టినట్టు ఉంటుంది. కానీ మిగతా కథ అంతా ఒక్కటే. మరో
కథనం ప్రకారం, బలి చక్రవర్తిని పాతాళానికి రాజును చేసినపుడు అతని కోరిక మేరకు
విష్ణుమూర్తి అక్కడే ఉండిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత విషయం తెలిసిన లక్ష్మీదేవి, తన
భర్తను తిరిగి వైకుంఠానికి తీసుకు వెళ్ళడం కోసం స్వయంగా పాతాళానికి వెడుతుంది. బలి
చక్రవర్తికి రక్షాబంధనం కడుతుంది. నీకు రక్షగా ఈ సూత్రం ఉంటుందని చెప్పి, తన
భర్తను తీసుకువెడుతుంది.
ఆధునిక చరిత్రలో,
అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడికి రక్షాబంధనం కట్టిన ఘటన ప్రసిద్ధమైనది. భారతదేశాన్ని
కైవసం చేసుకుని విశ్వవిజేత కావాలన్నది అలెగ్జాండర్ ఆలోచన. పురుషోత్తముడిని జయిస్తే
భారత్ లోనికి చొచ్చుకురావచ్చు. పురుషోత్తముడి బల పరాక్రమాలు తెలిసిన అలెగ్జాండర్
భార్య రుక్సానా, అతనితో యుద్ధానికి తలపడవద్దని భర్తను వేడుకుంటుంది. అలెగ్జాండర్
ఆమె మాటలను ఖాతరు చేయలేదు. యుద్ధానికి ముందురోజు రాత్రి రుక్సానా, పురుషోత్తముడి
శిబిరానికి వెళ్ళి, రక్షాబంధనం కట్టి, భర్త ప్రాణభిక్ష కోరుతుంది. అందుకే
కదనరంగంలో కత్తికి దొరికిన అలెగ్జాండర్ ను చంపకుండా వదిలిపెట్టేస్తాడు
పురుషోత్తముడు.
కాలగతిలో, అన్నాచెల్లెళ్ళ
లేదా అక్కాతమ్ముల అనుబంధానికి నిదర్శనంగా మారింది రక్షాబంధనం. ఈ పండుగ ప్రతీయేటా శ్రావణ పూర్ణిమ నాడు జరుపుకోవడం
ఆనవాయితీ. రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో రక్షాబంధనానికి విశేష ప్రాముఖ్యం ఉంది.
కార్యకర్తలు అందరూ సామూహికంగా జరుపుకునే పండుగల్లో ఇదొకటి. భారతమాత పదసేవకు
పునరంకితమవుదామని ప్రమాణం చేసే పర్వదినమిది. త్యాగానికి ప్రతీక అయిన కాషాయ వర్ణంలో
తరళమైన, సరళమైన రక్షాబంధనం ముంజేతి మీద మెరుస్తూ మనకు గుర్తు చేసే సందేశం ఒక్కటే. ‘‘నేను
నీకు రక్ష, నీవు నాకు రక్ష. మనందరం దేశానికీ ధర్మానికీ రక్ష’’.