ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా విశాఖ విమానాశ్రయంలో దాడి ఘటన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సాక్షిగా ఉన్న దినేష్ కుమార్ అనే వ్యక్తికి కోడికత్తిని అందించింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అంటూ న్యాయవాది సలీం సంచలన విషయాలు చెప్పారు. కోడి కత్తి కేసులో సీఎం జగన్మోహన్రెడ్డి విచారణకు హాజరైతే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతోనే కోర్టుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. ఈ కేసులో రాజకీయ ప్రయోజనాలు పొందాలనే కుట్ర కోణం దాగి ఉందని కోడికత్తి శ్రీను తరపున కేసు వాదిస్తోన్న న్యాయవాది సలీం స్పష్టం చేశారు.
విశాఖ ఎన్ఐఏ న్యాయస్థానంలో మంగళవారం కోడికత్తి కేసు విచారణకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసును కావాలనే సాగదీస్తున్నారని, రావాలి జగన్, చెప్పాలి వాదన, ఇవ్వాలి ఎన్వోసీ అంటూ సలీం డిమాండ్ చేశారు.
కోడికత్తి కేసు నాలుగేళ్లుగా విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. ఇటీవల ఈ కేసును విశాఖలోని ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. కేసు విశాఖ కోర్టుకు బదిలీ అయ్యాక మంగళవారం తొలిసారిగా విచారణకు వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాసరావును రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విశాఖ కోర్టుకు తీసుకువచ్చారు. కేసు విచారించిన న్యాయమూర్తి తదుపరి విచారణను సెప్టెంబరు 6వ తేదీకి వాయిదా వేశారు. విజయవాడ కోర్టులో సమర్పించిన రికార్డులు మొత్తం పరిశీలించి, విచారణను ముందుకు తీసుకెళ్లడానికి తమకు సెప్టెంబరు 18 వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరినా కోర్టు అనుమతించలేదు.
రికార్డుల పరిశీలనకు అంత సమయం అవసరం లేదని న్యాయమూర్తి జస్టిస్ మురళీకృష్ణ కేసును వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేశారు. సెప్టెంబరు 6న జనపల్లి శ్రీనివాసరావు పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌పై కోర్టు వాదనలు వినే అవకాశముంది. మంగళవారం కేసు విచారణ తరవాత కోడికత్తి శ్రీనును విశాఖ జైలుకు తరలిస్తారని అందరూ భావించారు. అయితే అతన్ని మరలా రాజమండ్రికి జైలుకు తీసుకెళ్లారు.
కోడి కత్తి కేసులో సీఎం జగన్మోహన్రెడ్డి కోర్టుకు హాజరై ఎన్వోసీ ఇవ్వాలంటూ దళిత సంఘాల నేతలు విశాఖ జీవీఎంసీ సమీపంలో ఆందోళనకు దిగడానికి సన్నద్దం అయ్యారు. నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దళిత సంఘాల నాయకులను ముందస్తుగా గృహ నిర్భందం చేశారు. నేతలను గృహ నిర్భందం చేయడాన్ని దళిత సంఘాల సమాఖ్య కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు తప్పుపట్టారు.
న్యాయం చేయండి
ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు కానీ న్యాయం చేయడం లేదని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఒక్కసారి కోర్టుకు వచ్చి తన కొడుకు పొడిచాడనో, పొడవలేదనో చెప్పాలని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. కోర్టులు మారుస్తున్నారు కానీ న్యాయం జరగడం లేదని ఆమె వాపోయారు. సీఎం కోర్టుకు హాజరైతేనే కేసు పరిష్కారం అవుతుందని శ్రీను సోదరుడు సుబ్బరాజు మీడియాతో చెప్పారు. దళిత సంఘాల నాయకులు తమకు మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు