జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి మారుతోంది. ఉగ్రవాదుల
ఘాతుకాల వేడితో అట్టుడికిపోతుండే ఈ ప్రాంతంలో పరిస్థితి ఇప్పుడు చల్లబడుతోంది. నరేంద్ర
మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని రద్దు చేయడం, రాఫ్ట్రాన్ని
రెండు భాగాలుగా విభజించి జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్రపాలితప్రాంతాలుగా
ఏర్పాటు చేసాక ఈ హిమాలయ ప్రాంతంలో ప్రశాంతత నెలకొంటోంది. ఉగ్రవాద భయం
తగ్గుతుండడంతో సాధారణ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వాటి ఫలితమే ఇప్పుడు మిస్
వరల్డ్ పోటీలకు ఈ ప్రాంతం వేదికయింది.
ప్రపంచంలోనే అద్భుతమైన అందమైన ప్రాంతాల్లో ఒకటి జమ్మూకశ్మీర్.
హిమాలయాల మంచుసోనలు, పూల వనాల సోయగాలు, దేవదారు వృక్షాల గాంభీర్యత, సెలయేళ్ళ
గలగలలు… వెరసి భూతల స్వర్గంగా ప్రఖ్యాతి గడించింది కశ్మీర భూభాగం. అలాంటి ప్రదేశం,
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచీ పొరుగుదేశాల ప్రేరేపణతో ఉగ్రవాదుల అరాచకాల
కారణంగా భారతదేశానికి నరకప్రాయమైపోయింది. 2019లో మోదీ సర్కారు జమ్మూకశ్మీర్
రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన నాటి నుంచీ క్రమంగా సాధారణ
పరిస్థితి నెలకొంటోంది. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపడంతో సామాన్య ప్రజలు ఊపిరి
పీల్చుకుంటున్నారు. వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. గత నాలుగేళ్ళలో
ఉగ్రవాదుల దుశ్చర్యలు చాలావరకూ తగ్గుముఖం పట్టాయి. దాంతో ప్రపంచం కూడా ఈ
ప్రాంతాన్ని వివాదాస్పద, ప్రమాదకర ప్రాంతంగా గుర్తించడం మాని…. అంతర్జాతీయ
స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తిస్తూ వస్తోంది. అందులో భాగంగానే… ఇప్పుడు మిస్
వరల్డ్ 71వ పోటీలకు జమ్మూకశ్మీర్‌ను ఎంపిక చేసారు.
2023 సంవత్సరానికి గాను మిస్ వరల్డ్ పోటీలు
కశ్మీర్లో నిర్వహించనున్నారు. ఆ సంగతిని మిస్ వరల్డ్ సీఈఓ జూలియా ఎరిక్
ప్రకటించారు. జూలియా, ఆమె బృందం మంగళవారం నాడు కశ్మీర్లో పర్యటించారు. ప్రస్తుత
మిస్ వరల్డ్ కరోలినా బీలాస్కా, కశ్మీర్‌ను సందర్శించడాన్ని తానెంతో అద్భుతంగా భావిస్తున్నానని
చెప్పారు. ఈ పోటీల్లో భారత్ తరఫున 2022 ఫెమీనా మిస్ ఇండియా విజేత సినీ శెట్టి పాల్గొనబోతున్నారు.
మిస్ వరల్డ్ బృందం మంగళవారం నాడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్
సక్సేనాతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ కశ్మీర్లో మిస్ వరల్డ్ పోటీల
నిర్వహణ ప్రపంచం భారతదేశాన్ని చూసే పద్ధతిలో గణనీయమైన మార్పు తెస్తుందని, భారతదేశపు
అంతర్జాతీయ వాణిజ్యానికి కొత్త ఊపు తెస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేసారు.
ఈ 71వ మిస్
వరల్డ్ పోటీల్లో భారతదేశపు ప్రతినిధిగా 2022 మిస్ ఇండియా విజేత సినీశెట్టి పాల్గొంటారు.
కశ్మీర్లో పర్యటించిన బృందంలో ఆమె కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
‘‘నేను చాలా ఉద్వేగానికి లోనవుతున్నాను. ఈసారి పోటీలు నా స్వదేశంలో జరుగుతున్నాయి.
ప్రపంచ దేశాల నుంచి 140 మంది సోదరీమణులను నేను నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను. వారందరూ
ఇక్కడకు వచ్చి భారతదేశపు మ్యాజిక్‌ని అనుభూతి చెందాలని కోరుతున్నాను. నేను ఈ
పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం మాత్రమే కాదు, పోటీదారులందరికీ నా
దేశంలో ఆతిథ్యం ఇస్తున్నాను. భారత భూమి సౌందర్యాన్నీ, మార్మికతనూ చూసి అనుభవించి
తీరాల్సిందే. నా మాతృదేశం పాటించే విలువలు, ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ
సంప్రదాయాలు, విభిన్న రకాలైన ఆహార రుచులు, వీటన్నింటిలో ఎంత వైవిధ్యం ఉందంటే అదే
నా దేశపు అందం. నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతోంది’’ అని చెప్పారు.
భారతదేశం 27 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మిస్ వరల్డ్
పోటీలకు ఆతిథ్యం వహిస్తోంది. గతంలో మన దేశంలో మిస్ వరల్డ్ పోటీలు 1996లో జరిగాయి.
భారత్ ఇప్పటికి ఆరుసార్లు మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది.