ఎండలతో అల్లాడిపోతోన్న ఏపీ ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. వాయువ్య గాలుల ప్రభావంతో యానాం, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా శామ్యూల్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలు, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పగటి ఉష్ణోగ్రత్తలు కూడా సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
బుధ, గురువారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు, రేపు పగటి ఉష్టోగ్రతలు సగటు కన్నా 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శని, ఆదివారం నాడు ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.