చైనా మరో అరాచకానికి తెరతీసింది. భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంతోపాటు, అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కూడా కలిపి అధికారిక మ్యాప్‌లను చైనా ముద్రించింది. చైనా తాజాగా ఆగష్టు 28న విడుదల చేసిన మ్యాపుల్లో భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్, దక్షిణ టిబెట్, 1962లో ఆక్రమించిన అక్సాయ్ చిన్ ప్రాంతాలను కూడా చేర్చింది. తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని కూడా కొత్త మ్యాపుల్లో ముద్రించి విడుదల చేసింది.
దక్షిణ చైనా సముద్ర సరిహద్దులపై అంతర్జాతీయ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే చైనా, వియత్నాం, పిలిప్ఫైన్స్, మలేషియా, బ్రూనై దేశాల మధ్య ఈ వివాదం నడుస్తోంది.
ఇటీవల జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారంపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా చెప్పారు. భారత్ చైనా మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని, ఇరు దేశాలు ఎల్ఏసీని గౌరవించాలని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు ఖ్వాత్రా గుర్తుచేశారు.
జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడు అయ్యాక అనేక దేశాలతో సరిహద్దు సమస్యలు ఎక్కువయ్యాయి. పొరుగుదేశాల ప్రాంతాల్లోకి చొచ్చుకుని పోవాలని చైనా చేస్తోన్న ప్రయత్నాలపై అనేక విమర్శలు వస్తున్నాయి. మరింత విస్తరించుకోవాలనే ఆకాంక్ష వల్ల అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
కొత్త మ్యాపులను చైనా సమర్థించుకుంటోంది. అరుణాచల్‌ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని చెబుతోంది. భారత్‌లోని 11 ప్రాంతాలకు గత ఏప్రిల్‌లో చైనా పేర్లు మార్చింది. వీటిల్లో పర్వత శిఖరాలు, నదులు, నివాస ప్రాంతాలు ఉన్నాయి.
చైనా ఇలాంటి చౌకబారు విధానాలకు పాల్పడటం ఇది మొదటి సారి కాదని, గతంలోనూ ఇలాంటివి చేసిందని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. భారత ప్రాంతాలను చైనా మ్యాపుల్లో చూపడాన్ని ఇప్పటికే ఖండించినట్టు ఆయన తెలిపారు. పేర్లు మార్చినంత మాత్రాన, మ్యాపుల్లో చూపినంత మాత్రాన వాస్తవికతను మార్చలేరని బాగ్చి స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు