రాజ్యాంగంలోని35ఎ అధికరణం కశ్మీరేతరులకు
కొన్ని కీలకమైన హక్కులను నిరాకరించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ అన్నారు. అవకాశాల్లో
సమానత్వం, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు, భూమిని కొనుగోలు చేసే అవకాశం…
ఈ మూడు హక్కులనూ 35ఎ అధికరణం కశ్మీరీయేతర ప్రజల నుంచి లాగేసుకుందని చంద్రచూడ్
అన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు సమకూర్చడం కోసం మిగిలిన వారిని
రాష్ట్రంలోకే రానీయలేదన్నారు. జమ్మూకశ్మీర్ రాజ్యాంగం కంటె భారత రాజ్యాంగమే
సమున్నతమైనదన్న కేంద్ర ప్రభుత్వవాదనను ఆయన అంగీకరించారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని
అందించే 370వ అధికరణం రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ 11వ రోజుకు
చేరుకుంది. ఆ విచారణలో భాగంగా జస్టిస్ చంద్రచూడ్ ఈ పరిశీలనలు చేసారు.
370వ అధికరణంతో పాటు రద్దు చేసిన 35ఎ అధికరణం
గతంలో రాష్ట్రంలోని శాశ్వత నివాసులు ఎవరో నిర్వచించింది. వారికి ప్రభుత్వ ఉపాధి,
స్థిరాస్తులు, కశ్మీర్లో స్థిరనివాసం వంటి ప్రత్యేక హక్కులు కల్పించిది.
అధికరణం 16(1) ప్రభుత్వ ఉద్యోగాలకు
భారతీయులందరూ అర్హులే అని చెబుతుంది. జమ్మూకశ్మీర్‌లో దాని అమలును మాత్రం తొలగించేసారు. పైగా దాన్ని
సవాల్ చేయడానికి అవకాశం లేకుండా 35ఎ అధికరణంలో రక్షణ కల్పించారు అని సీజేఐ
చెప్పుకొచ్చారు.
అలాగే భారతీయులు ఎవరైనా దేశంలో
ఎక్కడైనా స్థిరపడి, జీవించవచ్చునని అధికరణం 19 తెలియజేస్తుంది. దాన్ని కూడా
అధికరణం 35ఎ తొలగించింది. అలా… భారతీయ పౌరులకు ముఖ్యమైన మూడు హక్కులను 35ఎ
అధికరణం లేకుండా చేసిందని చంద్రచూడ్ అన్నారు.
జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని
రద్దు చేయడానికి కారణం అందరికీ సమానావకాశాలు కలిగించాలనుకోవడమే అని
కేంద్రప్రభుత్వం వాదించింది. ఇప్పుడు జమ్మూకశ్మీర్ ప్రజలు మిగతా భారతీయులు
అందరితోనూ సమానమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. గతంలో జమ్మూకశ్మీర్‌లో
అమలు కాని సంక్షేమ చట్టాలన్నీ ఇకపై ఆ రాష్ట్రంలోనూ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని
తుషార్ మెహతా వాదించారు.
కేంద్రప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్
జనరల్ తుషార్ మెహతా వాదనతో ఏకీభవిస్తూ జస్టిస్ చంద్రచూడ్ ‘‘అందువల్లే జమ్మూకశ్మీర్‌లో
సెక్యులరిజం, సోషలిజం అమలు అవలేదు’’ అని ముక్తాయించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు