హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ కంపెనీ షేర్ల పతనం వ్యవహారంలో కొత్తకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో పన్ను ఎగవేతకు స్వర్గధామాలుగా ఉన్న దేశాల ద్వారా విదేశీ పెట్టుబడిదారులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అదానీ కంపెనీల షేర్లలో షార్ట్ సెల్లింగ్ ద్వారా భారీగా ప్రయోజనం పొందారని దీనిపై విచారణ జరుపుతోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ఉటంకిస్తూ ఓ ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక వెల్లడించింది. ఈ వ్యవహారం గత జనవరిలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి దారితీసిందని తెలిపింది.
ఏమిటీ షార్ట్ సెల్లింగ్?
షార్ట్ సెల్లింగ్ అనేది వ్యూహాత్మక పెట్టుబడి మార్గాల్లో ఒకటి ఏదైనా కంపెనీ షేరు దారుణంగా పతనం కాబోతుందని కొందరు ఆ కంపెనీ షేర్లను పెద్ద ఎత్తున అమ్మేస్తారు. సదరు కంపెనీ షేర్లు దారుణంగా పడిపోగానే తక్కువ ధర వద్ద కొనుగోలు చేసి లాభాలు దండుకోవడాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. అదానీ కంపెనీలపై హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది.
రిజిస్టర్ చేసుకున్న విదేశీ పెట్టుబడిదారులను మాత్రమే డెరివేటివ్స్‌లో షార్ట్ సెల్లింగ్‌కు సెబీ అనుమతిస్తుంది. ఈ విభాగంలో మార్కెట్ రిస్క్ అధికంగా ఉంటుంది. అందుకే పెట్టుబడి నిబంధనలు కఠినంగా ఉంటాయి.
అదానీ కంపెనీ షేర్ల షార్ట్ సెల్లింగ్‌లో మరికొన్ని అసంబద్ద లావాదేవీలను కూడా ఈడీ గుర్తించిందని తెలుస్తోంది. పెట్టుబడిదారులను పక్కదారిపట్టించేందుకు ఓ భారత కంపెనీ ప్రయత్నించిందని సదరు కంపెనీని సెబీ వివరణ కోరినట్టు వార్తా కథనం ద్వారా వెల్లడవుతోంది.
గౌతమ్ అదానీ షేరు ధరలను నియంత్రించేందుకు మారిషస్‌లో షెల్ కంపెనీలు నిర్వహించారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. తమ అభివృద్ధిని, దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కావాలనే చేసిన దాడిగా అదానీ కంపెనీ వివరణ ఇచ్చింది.
దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సెబీని ఆదేశించడంతో ఆ సంస్థ రంగంలోకి దిగింది. అదానీ కంపెనీల షేర్ల ధరల నియంత్రణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల ప్యానల్ తేల్చింది. చిన్న పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడేందుకు కూడా అదానీ కంపెనీ తగిన చర్యలు తీసుకుందని నిపుణులు గతంలోనే సుప్రీంకోర్టుకు ఓ నివేదిక సమర్పించారు.