అస్సాంలో వరదలు విరుచుకుపడ్డాయి. తాజాగా 17 జిల్లాల్లో పోటెత్తిన వరదలకు 1.91 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లక్ష్మీపూర్ జిల్లాలో 47,400 మంది, ధేమాజీ జిల్లాలో 41000, గోలాఘాట్ జిల్లాలో 28000, శివసాగర్‌లో 21500, సోనిత్పూర్ జిల్లాలో 17800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అస్సాం విపత్తుల నిర్వహణ
సంస్థ ప్రకటించింది.
అస్సాంలో ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన వరదల్లో 15 మంది చనిపోయారు. తాజా వరదల్లో ఒకరు మరణించారని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు బ్రహ్మపుత్ర, దాని ఉప నదులు పొంగిపొర్లడంతో అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోందని కేంద్ర జల సంఘం ప్రకటించింది. దిబ్రూగఢ్, నీమాటిగఢ్, తేజ్‌పూర్, దుబ్రీ ప్రాంతాల్లో సుబాన్సిరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.
లక్ష్మీపూర్, దికోవ్, శివసాగర్ జిల్లాల్లో బ్రహ్మపుత్ర దాని ఉపనది దిసాంగ్ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. కామరూప్ జిల్లాలో జాతీయ రహదారిపైకి వరదనీరు చేరిందని దీంతో రవాణా నిలిచిపోయినట్టు అధికారులు వెల్లడించారు.
అస్సాంలో తాజా వరదలకు 42 రెవెన్యూ సర్కిల్స్ పరిధిలోని 522 గ్రామాలు నీట మునిగాయి. 2 పునరావాస కేంద్రాలు, 45 నిత్యావసర సరకుల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 17 జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు వరద సహాయకచర్యలు చేపట్టాయి. వరదల కారణంగా అస్సాంలో 18 ప్రధాన రహదారులు మూసుకుపోయి రవాణా స్ధంభించిపోయిందని ప్రభుత్వం ప్రకటించింది.