పుష్కర కాలంగా గుడి గోపుర శిఖరం మీదున్న
బంగారు కలశం మాయమైంది. దాన్ని కోతులు పడేసి ఉంటాయని, ఎవరో ఎత్తుకుని పోయి ఉంటారనీ
కథలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలు కథ ఏమిటోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణా జిల్లా గుడివాడ మండలం సిద్ధాంతం
గ్రామంలో ఒక శివాలయం ఉంది. ఆ ఆలయంలో బాలాత్రిపురసుందరీ అమ్మవారి మందిరం ఉంది. ఆ
మందిర గోపురం పైన రెండు శిఖరాలు ఉన్నాయి. పన్నెండేళ్ళ క్రితం ఆలయ ధర్మకర్తలు ఆ
రెండు శిఖరాల మీదా రెండు బంగారు కలశాలు ఏర్పాటు చేసారు. ఆ కలశాలు ఒక్కొక్కటీ
సుమారు కేజీ బరువుంటాయని అంచనా.
గత శనివారం నాడు, అంటే రెండు రోజుల
క్రితం ఆలయ ఉద్యోగి గోపుర శిఖరం మీద ఒక బంగారు కలశం లేదని గుర్తించారు. వెంటనే ఆ
విషయాన్ని ధర్మకర్తలకు తెలియజేసారు. వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఆలయానికి వచ్చి పరిసరాలు అన్నింటినీ పరిశీలించారు.
ఇక్కడివరకూ కథ మామూలుగానే ఉంది. ఆ తర్వాత
వినవచ్చిన విషయాలే విచిత్రంగా ఉన్నాయి. అమ్మవారి గుడి దగ్గర ఓ మర్రిచెట్టు ఉంది.
అది గుడి పైవరకూ విస్తరించి ఉంది. కొద్దిరోజులుగా ఈదురుగాలులకు ఆ మర్రిచెట్టు కొమ్మలు
ఆ కలశాలకు తగులుతున్నాయట.
కథలో అసలైన మలుపు ఇక్కడే ఉంది. బలమైన
గాలులకు కలశం విరిగిపోయి ఉండవచ్చనీ, దాన్ని కోతులు కింద పడేసి ఉంటాయనీ అప్పుడు ఆ
కలశాన్ని ఎవరైనా ఎత్తుకునిపోయి ఉంటారనీ ఆలయ అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కలశాన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దొంగతనం చేసారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కలశం మాయమవడం ఇంటిదొంగల పనే అయి ఉండొచ్చన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. కోతులే
కలశాన్ని పడేసి ఉంటాయన్న వాదన వింటుంటే ఆ అనుమానాలే నిజమై ఉండవచ్చు అనిపిస్తోంది.
మొత్తం మీద దేవాలయంలో దొంగతనం జరిగితే
దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారా అన్న భావన కలుగుతోంది.