విద్యార్థుల
ఆత్మహత్యల కట్టడికి రాజస్థాన్ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రెండు నెలల పాటు
శిక్షణా సంస్థలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ
అదేశాలు అమల్లోకి వస్తాయని కోటా అదికారయంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థుల్లో
మానసిక స్థైర్యం నింపేందుకే రెండు నెలలపాటు పరీక్షలు నిర్వహించకుండా నిర్ణయం
తీసుకున్నట్లు వెల్లడించింది.
విద్యార్థుల సన్నద్ధత తెలుసుకునేందుకు కోచింగ్ కేంద్రాల్లో
షెడ్యూల్ మేరకు తరుచుగా పరీక్షలు నిర్వహిస్తుంటారు. వీటిలో అంతగా ప్రతిభ
చూపలేకపోతున్న విద్యార్థులు అత్మన్యూనత, అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
నీట్
కోసం శిక్షణ తీసుకుంటున్న ఓ విద్యార్థి తాజాగా ప్రాణాలు తీసుకోవడంతో కోటాలో ఈ ఏడాది ఆత్మహత్య
చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కు పెరిగింది.
పోలీసులు
తెలిపిన వివరాల ప్రకారం.. నీట్(NEET)
శిక్షణ తీసుకుంటున్న 16 ఏళ్ల అవిష్కార్ అనే విద్యార్థి, కోచింగ్ సంస్థ భవనంపై
నుంచి దూకి ప్రాణాలు వదిలాడు. మహారాష్ట్రకు చెందిన అవిష్కార్ , కోటాలోని ఓ శిక్షణా
కేంద్రంలో మెడికల్ స్ట్రీమ్ కు సిద్ధం
అవుతున్నాడు. అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉంటున్న సదరు విద్యార్థి, కోచింగ్ తీసుకునే
భవనం ఆరో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు
ప్రారంభించినట్లు కోటా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధర్మవీర్ సింగ్
తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా మెడికల్ కాలేజీకి పంపినట్లు
చెప్పారు. మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందజేసినట్లు వెల్లడించారు. వారం, వారం
నిర్వహించే పరీక్షకు హాజరైన అనంతరం సదరు విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు
చెప్పారు. పరీక్షాకేంద్రం నుంచి బయటకు వచ్చిన ఐదు నిమిషాలకే ఆత్మహత్య
చేసుకున్నట్లు చెప్పారు.
జాతీయ
నేరగణాంక సంస్థ(NCRB) లెక్కల ప్రకారం.. 2021లో 13 వేల మంది
విద్యార్థుల బలవన్మరణం చెందగా, మహారాష్ట్రలో అత్యధికంగా 1,834 మంది ప్రాణాలు
విడిచారు. మధ్యప్రదేశ్ లో 1,308 మంది, తమిళనాడులో 1,246 కర్ణాటకలో 855 మంది
ఆత్మహత్య చేసుకోగా ఒడిషాలో అత్యల్పంగా 834 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
విద్యార్థుల
బలవంతపు చావులు ఆపేందుకు కోటాలోని వసతి గృహాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
భవనాల చుట్టూ ఇనువ వలలు, గదుల్లో స్ప్రింగ్ కాయిల్ ఫ్యాన్లు అమర్చారు.
కోటాలో
విద్యార్థుల ఆత్మహత్యలపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ సమీక్ష నిర్వహించి, సమగ్ర
దర్యాప్తునకు ఆదేశించారు. 9,10 తరగతి విద్యార్థులను పోటీ పరీక్షల శిక్షణకు పంపడం కూడా
వారిపై ఒత్తిడి పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తరగతి వార్షిక పరీక్షలతోపాటు
పోటీ పరీక్షలు రాయాల్సి రావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని గెహ్లాత్ గతంలో
సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు.
రాజస్థాన్
లోని కోటా ప్రాంతం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి. అక్కడ వివిధ రకాల పోటీ
పరీక్షలకు శిక్షణ ఇస్తారు.