ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో మొబైల్స్ వాడకంపై నిషేధం విధించింది. విద్యార్థులు బడులకు మొబైల్స్ తేవడాన్ని పూర్తిగా నిషేధించింది. ఉపాధ్యాయులు కూడా తరగతి గదుల్లోకి మొబైల్స్ తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ జీవో జారీ చేసింది. టీచర్లు తరగతి గదిలోకి వెళ్లే ముందు వారి మొబైల్ ఫోన్ను ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని జీవోలో తెలిపింది. యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలుంటాయని హెచ్చరించింది. ప్రధానోపాధ్యాయులు తాజా నిబంధనలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. బోధనకు ఆటంకాలు కలగకుండా ఉండేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.