ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, సీఎం పదవి గుంజుకుని, ఆయన చావుకు కారణమైన చంద్రబాబునాయుడు, స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొనడం సిగ్గుచేటని సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ అంటూ రైతులను మోసం చేసిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడని జగన్మోహన్రెడ్డి విమర్శించారు.
పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ప్రతి అడుగులో కుట్రలు కుతంత్రాలు కనిపిస్తాయని జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశాడని, ఆయన పేరు చెబితే ఒక్క పథకం పేరైనా గుర్తుకు వస్తుందా అంటూ ప్రజలను ప్రశ్నించారు. సొంత పుత్రుడిపై నమ్మకం లేక దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చితెచ్చుకున్నాడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. మరలా దొంగఓట్లు నమోదు చేస్తున్నారంటూ నాటకాలు ఆడుతున్నారని, టీడీపీ పాలనలోనే దొంగఓట్లు నమోదు చేశారని, అవి తొలగిస్తుంటే ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయం ఇది : లక్ష్మీ పార్వతి
ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణెం విడుదలకు తనను ఆహ్వానించకపోవడంపై జరిగిన అన్యాయంపై లక్ష్మీ పార్వతి స్పందించారు. ఇది తన భర్త ఎన్టీఆర్‌కు జరిగిన అవమానంగా భావిస్తానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తనను వివాహం చేసుకున్నారో లేదో ఆయన పిల్లలే చెప్పాలని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానం రాకుండా పురందేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. తనకు ఎన్టీఆర్‌కు వివాహం అయినట్టు ఆయన అనేక వేదికలపై చెప్పారని, వార్తా కథనాలు కూడా ఉన్నాయని లక్ష్మీ పార్వతి గుర్తుచేశారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు ఫిర్యాదు చేయనున్నట్టు లక్ష్మీపార్వతి మీడియాకు వెల్లడించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు