తిరుమలలో చిరుతల కలకలం తగ్గడం లేదు. తాజాగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుతపులి చిక్కింది. అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలురాయి దగ్గర ఏర్పాటు చేసిన బోనులో తాజాగా ఒక చిరుతపులి చిక్కిందని టీటీడీ అధికారులు తెలిపారు. గతంలో మూడు చిరుత పులులు పట్టుబడ్డాయి, ఇప్పుడు నాలుగో చిరుతపులి చిక్కిందని అటవీ అధికారులు వెల్లడించారు. నాలుగో చిరుత సుమారు వారం రోజులుగా బోను దగ్గరకు వస్తున్నట్టు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఎట్టకేలకు ఆదివారం రాత్రి నాలుగో చిరుత బోనులో చిక్కిందని అధికారులు చెప్పారు. తాజాగా చిక్కిన చిరుతను తిరుపతిలోని జూ పార్కుకు తరలించినట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో స్వామివారి దర్శనానికి వెళుతోన్న నెల్లూరుకు చెందిన లక్షిత అనే బాలికపై చిరుత దాడి చేసింది. ఆ దాడిలో లక్షిత చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చిక్కిన చిరుతల నుంచి రక్తం శాంపిల్స్ తీసుకుని
పరీక్షలకు పంపారు. వాటి ఫలితాలు వస్తే లక్షితపై దాడి చేసిన చిరుతను గుర్తించే అవకాశం లభిస్తుంది.
కాలినడక మార్గం ఇరువైపులా అటవీ శాఖ అధికారులు వందలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల కదలికలను గమనిస్తున్నారు. ఆ తరవాత చిరుతలు సంచరించే ప్రదేశాలను గుర్తించి అక్కడ బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. చిరుతలకు అడవిలో ఆహారం లభించకుండా చేసి బోన్లలో ఆహారం పెట్టి ఎర వేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. గడచిన రెండు నెలల్లో నాలుగు చిరుతలు చిక్కడంతో తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు