ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నాణేన్ని ముద్రించింది.
రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్టీఆర్ నాణెం విడుదల చేశారు. ముందుగా రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన 20 నిమిషాల నిడివిగల వీడియోను ప్రదర్శించారు.
హైదరాబాద్ మింట్లో తయారు చేసిన ఎన్టీఆర్ నాణెంలో 50 శాతం వెండి, 40 రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ ఉపయోగించారు. ఈ నాణేలను పరిమితంగా మాత్రమే ముద్రిస్తారు. వీటిని చలామణిలోకి తీసుకు వచ్చే అవకాశం లేదు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు భువనేశ్వరి, ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ అల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పలువురు ఎంపీలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ఆయన కుమార్తె, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ప్రముఖ నటుడు, ఎన్టీఆర్ మనమడు జూ.ఎన్టీఆర్ దేవర షూటింగ్ కారణంగా హాజరు కాలేకపోయారు.