చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ మొదటి సారిగా శాస్త్రీయ సమాచారం పంపిందని ఇస్రో వెల్లడించింది. చంద్రుని ఉపరితలంపై, ఉపరితలం నుంచి 10 సెం.మీ లోతులో విక్రమ్ ల్యాండర్ ఉష్టోగ్రతలు నమోదు చేసినట్టు ఇస్రో ప్రకటించింది. చంద్రుని ఉపరితలంపై ఉష్టోగ్రతలు తెలుసుకోవడం ద్వారా అక్కడి పరిస్థితులు అంచనా వేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రునిపై వాతావరణం లేదు. చంద్రుని ఉపరితలంపై ఉష్టోగ్రతల్లో చాలా తేడా ఉంటుంది. చంద్రయాన్-3 చంద్రునిపై ఉష్టోగ్రతలను విక్రమ్ ల్యాండర్ గ్రాఫ్ రూపంలో అందించిందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.
తాజాగా అందిన సమాచారం ద్వారా చంద్రుని ఉపరితలం, ఉపరితలం నుంచి 10 సెం.మీ లోతులో ఉష్టోగ్రతలు వ్యత్యాసాలను గ్రాఫ్ ద్వారా వివరించింది. చంద్రుని దక్షిణ ధ్రువం నుంచి ఇలాంటి సమాచారం అందడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. దీనిపై మరిన్ని పరిశోధనలు జరుపుతున్నట్టు ఇస్రో ప్రకటించింది.
చంద్రుని ఉపరితలంపై ఊహించిన దానికంటే ఎక్కువ ఉష్టోగ్రతలు నమోదయ్యాయని ఇస్రో శాస్త్రవేత్త బీహెచ్ఎం దారుకేషా అభిప్రాయపడ్డారు. చంద్రుని ఉపరితలంపై
20 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేయగా తాజాగా అందిన సమాచారం ప్రకారం 70 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయని గ్రాఫ్ ద్వారా తెలుస్తోందని దారుకేషా తెలిపారు. చంద్రునిపై వాతావరణం, నేల స్వభావం, ఖనిజాల గురించి చంద్రయాన్-3 మిషన్ సమాచారం పంపుతుందని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.