కేసీఆర్ పదేళ్ల పాలనలో అవినీతి పెరిగిపోయిందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో షా ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎం అయ్యాక భద్రాచలం రామయ్యను నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు. కేసీఆర్ పని అయిపోయిందని ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని షా
భాష్యం చెప్పారు.
బీఆర్ఎఎస్ స్టీరింగ్ మతోన్మాద ఎంఐఎం చేతుల్లో ఉందని అమిత్ షా చురకలు వేశారు. ఇలాంటి పార్టీ తెలంగాణకు అవసరమా అంటూ ప్రజలను ప్రశ్నించారు. నాయకులు, కార్యకర్తలపై కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నారని బండి సంజయ్, ఈటెల అరెస్టులతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరని షా హెచ్చరించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని, ఒకరి తరవాత ఒకరు వస్తారని, కేసీఆర్ పోతే కేటీఆర్ వస్తారని షా ఎద్దేవా చేశారు. బీజేపీలో అలాంటి పరిస్థితి లేదని ఎవరు కష్టపడితే వారికే పదవులు వస్తాయని షా అన్నారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను, రుణమాఫీ అంటూ రైతులను, డబుల్ బెడ్ రూం అంటూ పేదలను కేసీఆర్ మోసం చేశాడని అమిత్ షా విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో రైతులకు రూ.7 లక్షల కోట్ల సాయం చేస్తే, తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ రైతుల కోసం రూ.20 లక్షల కోట్లు ఖర్చు చేశారని షా గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా 200 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు పండితే, నేడు మోదీ హయాంలో 320 మిలియన్ టన్నుల దిగుబడి వస్తోందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోళ్ల చేయకుండా కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడని, కేంద్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి 19 మిలియన్ టన్నులు కొనుగోలు చేస్తోందన్నారు. మోదీ ప్రధాని అయ్యాక కనీసం మద్దతు ధరను 64 శాతం పెంచినట్టు అమిత్ షా గుర్తుచేశారు. తెలంగాణలో కేసీఆర్ పాలనా వైఫల్యాలపై ఆయన ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని షా ప్రజలను కోరారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు