కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న
సంక్షేమ పథకాలతో పేదలంతా రానున్న కాలంలో మధ్యతరగతి వర్గాలుగా మారతారని ప్రధాని
నరేంద్రమోదీ అన్నారు. వారంతా దేశాభివృద్ధికి చోదకులుగా ఉంటారని వివరించారు.
దిల్లీలో జరుగుతున్న బిజినెస్-20
సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ, కోట్లాది మంది ప్రజలు పేదరికాన్ని జయించి నియో
మిడిల్ క్లాస్ గా మారారని పేర్కొన్నారు. ఆ మార్పు కేంద్రప్రభుత్వ అభివృద్ధి
నమూనాను సూచిస్తోందన్నారు. పేదలంతా మధ్యతరగతి వర్గీయులుగా మారితే
వారే అతిపెద్ద వినియోగదారులుగా ఉంటారన్న ప్రధాని, కొత్త ఆకాంక్షలతో వారంతా దేశ
ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తారన్నారు.
ప్రభుత్వం
ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాల కారణంగా రానున్న ఐదారేళ్లలో పేదరికం సమసిపోతుందని
మధ్య తరగతి జనాభా భారీగా పెరుగుతుందని అంచనా వేశారు. మధ్యతరగతి ప్రజల కొనుగోలు
శక్తి పెరగడంతో వాణిజ్యరంగానికి ఊతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్వార్థపూరిత
చర్యలతో దేశానికిగాని ప్రపంచానికి గాని ఎలాంటి మేలు జరగదని ప్రధాని స్పష్టం
చేశారు.
వ్యాపారం,
వినియోగదారుల మధ్య సమతుల్యత పాటించినప్పుడే మార్కెట్ లో నిలదొక్కుకుని లాభాలు
గడిస్తామని, ఇదే సూత్రాన్ని దేశీయ, అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో అనుకరించాలని కోరారు.
ఇతర
దేశాలను కేవలం మార్కెట్ కోణంలోనే చూస్తే ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా నష్టం జరుగుతుందని
స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరిని భాగస్వాములు
చేయడం ద్వారా ప్రగతి సాధించవచ్చని వివరించారు. వినియోగదారుల
సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరిన మోదీ, ప్రతి ఏడాది అంతర్జాతీయ వినియోగదారుల
సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
దిల్లీలో
వచ్చే నెలలో జరిగే జీ-20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో సభ్యదేశాల మధ్య వ్యాపార
విషయాలు చర్చించేందుకు బిజినెస్ -20 సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీ-20 ఫోరమ్
జీ-20 సదస్సుకు 54 సిపార్సులు చేసింది. అలాగే వాణిజ్యాభివృద్ధికి జీ-20 సభ్యదేశాలు
అనుసరించాల్సిన 172 విధానపరమైన సిఫార్సులు చేసింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు