చంద్రయాన్-3 విజయం సరికొత్త భారత్‌కు ప్రతీకంటూ ప్రధాని మోదీ 104వ మన్ కీ బాత్ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 విజయం మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిందన్నారు. ఢిల్లీలో జరగనున్న జీ-20 సమావేశాలకు ఎన్నడూ లేని విధంగా 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారని ప్రధాని గుర్తుచేశారు. జీ-20 సమావేశాలకు భారత్ నేతృత్వం వహించడం అంటే, అది ప్రజలే అధ్యక్షత వహించినట్టుగా భావించాలని మోదీ అన్నారు.
జీ-20 సమావేశాలకు భారత్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అందరూ గర్వించదగ్గ పరిణామాలు చోటు చేసుకున్నాయని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీనగర్‌లో జీ-20 సదస్సు జరిగిన తరవాత అక్కడ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన గుర్తుచేశారు. మన దేశంలో వైవిధాన్ని చూసి విదేశీ ప్రతినిధులు చాలా ప్రభావితమైనట్టు మోదీ చెప్పారు. భారత్‌కు మంచి భవిష్యత్తు ఉన్నట్టు వారు గుర్తించినట్టు ప్రధాని అభిప్రాయపడ్డారు. క్రీడల్లోనూ భారత్ నిలకడగా రాణిస్తోందని మోదీ పేర్కొన్నారు. చైనాలో నిర్వహించిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో మన ఆటగాళ్లు పతకాలు సాధించినట్టు ఆయన గుర్తుచేశారు.
ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు సంస్కృతం బోధించడంలో భాగంగా సంస్కృత భారతీ ఆధ్వర్యంలో నిర్వహించే క్యాంపులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంస్కృతం తరహాలో తెలుగు కూడా అతి పురాతనమైన భాషని, ఏటా ఆగష్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నట్టు ప్రధాని మోదీ గుర్తుచేశారు.
దేశవ్యాప్తంగా మేరీ మాటి, మేరీ దేశ్ కార్యక్రమం సాగుతోందన్నారు. వచ్చే నెలలో దేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మట్టి సేకరించే కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలని ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌తో పిలుపునిచ్చారు. ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో రాణించిన క్రీడాకారులు ప్రియాంక, ప్రగతి, ఆమ్లాన్లతో ప్రధాని ముచ్చటించారు. మరిన్ని విజయాలు సాధించాలని వారిని ప్రోత్సహించారు.
చంద్రయాన్-3 విజయవంతమైన సందర్భంగా ఆగష్టు 23ని ఇక నుంచి జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించారు. దక్షిణ ధృవంలో విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని పేరుపెట్టారు.
ఒకసారి విఫలమైనంత మాత్రాన అది అంతమైనట్టు కాదని, ప్రస్తుత విజయం రాబోయే రోజుల్లో భారత్ చేసే ప్రతి ప్రయత్నానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.