ఇటీవల విశ్వ హిందూ పరిషత్ హర్యానాలోని నుహ్ జిల్లాలో చేపట్టిన శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం హిందూ సంస్థలు
శోభాయాత్రకు మరోసారి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 26 నుంచి 28 అర్థరాత్రి వరకు ఆంక్షలు విధించారు. విద్యాసంస్థలు, బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. నుహ్ జిల్లాలో 144 సెక్షన్ విధించారు. అల్లర్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఆంక్షలు విధించినట్టు హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్ వెల్లడించారు. సెప్టెంబరు 3 నుంచి 7 వరకు జీ-20 సమావేశాల నేపథ్యంలో, ఆ సమయంలో శోభాయాత్రలకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన చెప్పారు.
సోమవారంనాడు శోభాయాత్ర జరిపితీరుతామని విశ్వ హిందూ పరిషత్ ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు మూసివేయాలని ఆదేశించారు. దుకాణాలు కూడా తెరవద్దని నుహ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ దీరేంద్ర ప్రకటించారు. సోమవారం విశ్వహిందూ పరిషత్ చేపట్టే యాత్రకు
అనుమతి లేదని ఆయన తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు రాష్ట్రాల పోలీసు అధికారులతో కూడా సమావేశాలు నిర్వహించి, వారిని అప్రమత్తం చేశారు.
శోభాయాత్ర జరిపితీరుతాం : విహెచ్పి
సోమవారం విశ్వహిందూ పరిషత్ చేపట్టిన శోభాయాత్రకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ సంస్థ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ ప్రకటించారు. అయినా శోభాయాత్ర వివరాలను ముందుగా పోలీసు అధికారులకు తెలియజేశామన్నారు. సోమవారం యాత్ర నిర్వహిస్తోంది తాము కాదని, సర్వహిందూ సమాజ్ అని సురేంద్రజైన్ మీడియాకు చెప్పారు. మెవాత్ నిర్వహించే యాత్రకు దూర ప్రాంతాల వారు రావద్దని ఆయన సూచించారు. ఇలాంటి యాత్రలు ఏ ప్రాంతం వారు అక్కడే నిర్వహించుకోవాలని కోరారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు