వరుస వరదలతో అతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే జాతీయ రహదారులపై కొండచరియలు నేటికీ విరిగిపడుతూనే ఉన్నాయి. అనేక ప్రాంతాలకు రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. హిమాచల్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలిపే కులు మనాలి జాతీయ రహదారి ఇంకా తెరుచుకోలేదు. వర్షాలు తగ్గుముఖం పట్టినా కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం నాడు కులు మనాలి, పండోహ్, కమండ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు వెల్లడించారు. కొండచరియలు తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు జిల్లా యంత్రాంగం తెలిపింది.
ఇప్పటి వరకు వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 367 మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. రూ.12000 కోట్ల ఆస్థినష్టం వాటిల్లిందని అంచనా వేశారు. జూన్ 24 నుంచి కురుస్తోన్న అతి భారీ వర్షాలు, వరదలకు ప్రతి రోజు సగటున 7 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.
ఇప్పటికీ ఎనిమిది ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ను అనుమతించడం లేదని పోలీసు అధికారులు వెల్లడించారు. మొత్తం 113 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాలుగైదు రోజుల్లో కొండచరియలు తొలగించి రవాణా వ్యవస్థను చక్కదిద్దేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రాత్రిబవళ్లు పనిచేస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.