చంద్రయాన్-3
దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ అని పేరు పెట్టడానికి గల కారణాన్ని ప్రధాని మోదీ
వివరించారు. ‘‘ శివ అనే పదాన్ని శుభంగా భావిస్తాం, దేశంలోని నారీమణుల గురించి
మాట్లాడే సమయంలో శక్తిని అనే పదాన్ని వాడుతాం, ఆ పేరు వెనక ఉద్దేశం అదేనని మోదీ
వివరించారు. అలాగే చంద్రయాన్ -2 క్రాష్ అయిన చోటును తిరంగా పాయింట్ అని
పిలుచుకుందాం అని చెప్పారు.
బెంగళూరులో
ఇస్రో శాస్త్రవేత్తలను అభినందనలు తెలిపి దిల్లీ వచ్చిన ప్రధాని మోదీకి స్థానిక
బీజేపీ నేతలు ఘనస్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా శివశక్తి నామకరణం గురించి
వివరించారు.
‘‘శివత్వంలో మానవ జాతికి మేలు జరగాలన్న సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోగల సామర్థ్యం శక్తి వల్ల లభిస్తుంది. చంద్రుడి మీది శివశక్తి పాయింట్, హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకూ కలిసి ఉండాలనే పాఠం చెబుతుంది. మన ఋషులు ‘ఏన కర్మణ్య పశో, మనుష్యో యజ్ఞే గుణవంతి విత్తేషు ధీరః యత్పూర్వ యక్షమంతః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు’ అని చెప్పారు. అంటే, ఏ మనసుతో మనం మన కర్తవ్యాన్ని నెరవేరుస్తామో… ఆలోచనలను, విజ్ఞానాన్నీ నడిపిస్తామో… ఆ మనసు శుభప్రదమైన, కళ్యాణకరమైన సంకల్పాలతో జోడించబడి ఉండాలి. మనస్సు చేసే ఈ శుభ సంకల్పాలను పూర్తి చేయడానికి మనకు శక్తి (అమ్మవారి) ఆశీర్వాదం తప్పనిసరి. ఆ శక్తి మన నారీ (మహిళా) శక్తి. మన తల్లులు, అక్కలు, చెల్లెళ్ళే ఆ శక్తి. మన పెద్దలు ఒకమాట చెప్పారు: సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని. అంటే, నిర్మాణం నుంచి ప్రళయం వరకూ ఈ మొత్తం సృష్టికి నారీ శక్తే ఆధారం. చంద్రయాన్-3లో మన మహిళా శాస్త్రవేత్తలు, మన నారీశక్తి, కీలక భూమిక పోషించారు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు.
జీ-20
సదస్సు సందర్భంగా దిల్లీ ప్రజలకు బాధ్యతలు మరింత పెరిగాయన్న ప్రధాని మోదీ, విదేశీ
అతిథుల రాకతో అసౌకర్యం కలగవచ్చు ఈ విషయంలో ముందుగానే క్షమాపణలు కోరుతున్నట్లు
చెప్పారు. సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు భారీ సంఖ్యలో దేశవిదేశీ ప్రతినిధులు ఈ
సదస్సుకు హాజరవుతారు.