గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి
‘వ్యోమమిత్ర’ అనే మహిళా రోబోను పంపిస్తామని సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయమంత్రి
జితేంద్రసింగ్ చెప్పారు.
గగన్‌యాన్ ప్రాజెక్టులో తొలుత
ప్రయోగాత్మకంగా ఒక స్పేస్ఫ్లైట్ని వచ్చే అక్టోబర్ నెల మొదటి లేదా రెండో వారంలో పంపిస్తారని
మంత్రి చెప్పారు. దాని తరువాతి మిషన్‌లో మహిళారోబో ‘వ్యోమమిత్ర’ను ప్రయోగిస్తారని
చెప్పారు.
‘‘కరోనా మహమ్మారి కారణంగా గగన్‌యాన్
ప్రాజెక్టు ఆలస్యమైంది. ఇప్పుడిక మొదటి ట్రయల్ మిషన్‌ను అక్టోబర్ మొదటి లేదా రెండో
వారంలో చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాం. రోదసిలోకి వ్యోమగాములను పంపించడం ఎంత ముఖ్యమో,
వారిని వెనక్కు తీసుకురావడం కూడా అంతే ముఖ్యం’’ అన్నారు జితేంద్ర సింగ్.
‘‘రెండో మిషన్‌లో ఒక మహిళా రోబో వ్యోమగామి
ఉంటుంది. మనుషులు చేసే ప్రతీ పనినీ అది చేయగలదు. అంతా సవ్యంగా జరిగితే, మేం
ముందడుగు వేస్తాం’’ అని చెప్పారు.
ఇక చంద్రయాన్-3 గురించి చాలా ఉద్వేగంగా
చెప్పారు జితేంద్రసింగ్. చందమామ దక్షిణ ధ్రువం మీద విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టిన
క్షణంలో అనుభవించిన ఉపశమనం గురించి వివరించారు.
‘‘ఇస్రోతో సన్నిహితంగా పనిచేసిన వాళ్ళం,
మేము చాలా నెర్వస్ అయిపోయాం. నా వరకూ నేను… చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ భూమి
కక్ష్యను వదిలి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో బాగా నెర్వస్ అయిపోయాను.
ఇంక ల్యాండింగ్ అయితే చాలా సులువుగా జరిగిపోయింది’’ అని చెప్పారు.
చంద్రుడి మీద స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండ్
అవడం ఇస్రో గమనంలో చాలా పెద్ద ముందడుగు అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘అంతరిక్ష
రంగానికి ప్రధాని మోదీ అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు కాబట్టే ఇది సాధ్యమైంది. 2019
వరకూ శ్రీహరికోట తలుపులు మూసే ఉండేవి. ఈసారి మీడియాతో పాటు చిన్నపిల్లలను సైతం ఆహ్వానించారు.
అందుకే ఈసారి ప్రయోగాలను ప్రజలు తమవిగా భావించారు’’ అని జితేంద్రసింగ్ చెప్పారు.
అంతరిక్ష పరిశోధనలకు కేటాయించే
నిధులను కూడా గణనీయంగా పెంచినట్టు మంత్రి చెప్పారు.