భారతీయులందరినీ ఏకతాటిపై ఉంచడంతో పాటు వారసత్వ పరిరక్షణకు భిన్నత్వంలో ఏకత్వం ఎనలేని పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. విభిన్నమైన, సుసంపన్నమైన సంస్కృతుల సమ్మేళనంతో భారతదేశం తులతూగుతోందన్నారు.
వారణాసిలో ప్రారంభమైన జీ-20 సాంస్కృతిక సదస్సును ఉద్దేశించి వర్చువల్ విధానంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, దేశంలోని మారుమూల పల్లెల్లోనూ సాంస్కృతిక సంపదలు పదిలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
జీ-20 సాంస్కృతిక శిఖరాగ్ర సదస్సు వేదికగా అత్యంత ఘనమైన భారత సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, ప్రదర్శనకు అవకాశం దొరుకుతుందన్న మోదీ, వైవిధ్య భరితమైన సాంస్కృతిక వారసత్వం ఉండడం గర్వించదగిన విషయమన్నారు.
దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు వివరించారు.
దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియాల ద్వారా అడవిబిడ్డల శక్తివంతమైన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతామన్నారు. ఆదివాసుల జీవన విధానం, సంప్రదాయాలను చాటిచెప్పడమే వాటి ప్రాథమిక లక్ష్యమని వెల్లడించారు. దిల్లీలోని ప్రధానమంత్రి మ్యూజియం కూడా ఇదే తరహాదని చెప్పారు. భారత ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించే వేదిక అని అభివర్ణించారు.
యుగే యుగీన్ భారత్ మ్యూజియం నిర్మాణం పూర్తైతే ప్రపంచంలోనే అతిపెద్ద వస్తు ప్రదర్శన శాలగా అవతరిస్తుందని, ఇది భారతీయ చరిత్ర, సాంస్కృతికతల విస్తృతిని విపులంగా వివరిస్తుందని చెప్పారు. ప్రజలందరినీ ఏకం చేయడమనే సహజమైన, ప్రత్యేకమైన సామర్థ్యం సంస్కృతికి ఉందని చెప్పారు. దేశంలోని వివిధ వర్గాల విభిన్న నేపథ్యాలు, దృక్పథాలను అవగాహన చేసుకోడానికి భారత్లోని భిన్నత్వం వీలు కల్పిస్తుందన్నారు.