ఒడిషా బాలాసోర్ ఘోర రైలు ప్రమాద ఘటన కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఇంజనీర్లు పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఎలాంటి అనుమతులూ లేకుండా 94వ నెంబర్ లెవల్ క్రాసింగ్ గేటు వద్ద పనులు చేయడమే ప్రమాదానికి దారి తీసిందని ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న సీబీఐ, ప్రత్యేక కోర్టుకు తెలిపింది.
ఒడిషాలోని బాలాసోర్ వద్ద జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 295 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. రైలు దుర్ఘటన కేసులో సీనియర్ సిగ్నల్ సెక్షన్ ఇంఛార్జి అరుణ్ కుమార్ మహంత సహా మరో ముగ్గురు అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను భువనేశ్వర్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఇవాళ తిరస్కరించింది.
సీనియర్ డివిజనల్ సిగ్నల్, టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ ఆమోదం తెలపని సర్క్యూట్ డయాగ్రామ్‌తో బాలాసోర్ సమీపంలోని బహనాగ బజార్ స్టేషన్ వద్ద 94వ లెవల్ క్రాసింగ్ గేటు సమీపంలో సిగ్నల్ పనులు చేపట్టారని సీబీఐ తెలిపింది. 79వ నెంబర్ లెవల్ క్రాసింగ్ గేటు వద్ద ఉపయోగించిన టిపికల్ సర్క్యూట్ డయాగ్రమ్‌తోనే 94వ నెంబర్ గేటు వద్ద కూడా, ఎలాంటి ఆమోదమూ లేకుండా పనులు చేసినట్టు సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.
మహంత పర్యవేక్షణలోనే 94వ గేటు వద్ద పనులు జరిగాయని ప్రత్యేక కోర్టుకు సీబీఐ వివరించింది.
94వ నెంబర్ గేటు కొంతకాలంగా సక్రమంగా పనిచేయడం లేదని ఉన్నతాధికారులకు చెప్పినా సరైన చర్యలు తీసుకోలేదని మహంత తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. 94వ గేటు వద్ద జరిగిన పనుల పర్యవేక్షణను ఇతరులకు అప్పగించారని, ఆ పనులు జరిగిన సమయంలో తాను అక్కడ లేనని మహంత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు, సిగ్నలింగ్ పనులు… ఆమోదం పొందిన ప్రణాళిక ప్రకారం జరగలేదన్న సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది. మహంత, మరో ముగ్గురు అధికారులు పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది.
జూన్ 2న బాలాసోర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 295 మంది ప్రయాణీకులు చనిపోయారు. మరో 1000 మందికి పైగా గాయపడ్డ సంగతి తెలిసిందే.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు