మరాఠీ రాజకీయాల్లో రోజుకో నాటకీయ పరిణామం చోటుచేసుకుంటుంది. కుటుంబ పార్టీల కారణంగా రాజకీయ గందరగోళానికి దారి తీస్తోంది. పార్టీల్లో వారసత్వ పోరు పెచ్చుమీరడంతో ఎవరి దారి వారు ఎంచుకుంటున్నారు.
శివసేన చీలిక వార్తలు మరుగున పడకముందే ఎన్సీపీ నిట్టనిలువుగా చీలింది. శరద్ పవార్(బాబాయి), అజిత్ పవార్(అబ్బాయి) వర్గాలుగా వేరు కుంపట్లు పెట్టుకున్నారు.
శరద్ పవార్ వర్గం I.N.D.I.A లో భాగస్వామిగా ఉండగా అజిత్ పవార్ మాత్రం ఎన్డీయే మద్దతుదారుడిగా ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సీనియర్ రాజకీయనేత శరద్ పవార్ మాత్రం రోజుకొక ప్రకటన చేస్తూ పార్టీ కేడర్ తో పాటు I.N.D.I.A మిత్రులను అయోమయంలోకి నెట్టేస్తున్నారు. అన్న కొడుకు అజిత్ పవార్ తో ఎలాంటి విభేదాలు లేవంటూనే కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉంటానని చెబుతున్నారు. మరోవైపు అజిత్ పవార్ తో వరుసగా భేటీ అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘అజిత్ తమ నాయకుడు, అతను ఇక ముందు కూడా తమ నాయకుడిగానే కొనసాగుతాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అంటూ శరద్ ప్రకటించడంతో ఆయన వర్గానికి మింగడుపడటం లేదు.
బారామతి పర్యటనలో భాగంగా రాజకీయ కురువృద్ధుడి ప్రకటన మరాఠా రాజకీయాల్లో సంచలనంగా మారగా, కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమికి ఇబ్బందికరంగా మారింది.
ఎన్సీపీ చీలిక వార్తలపై కూడా స్పందించిన శరద్ పవార్ అలాంటిదేమీ జరగలేదన్నారు. జాతీయ స్థాయిలో పెద్దస్థాయి నేతలు పార్టీని వీడితే చీలిక ఏర్పడినట్లు అని వివరించిన ఎన్సీపీ వ్యవస్థాపకుడు… ప్రస్తుతం అలాంటి పరిస్థితులు సంభవించలేదన్నారు. కొంతమంది నేతలు రాజకీయంగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ దానిని విభజనగా చెప్పడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో వారు అలా వ్యవహరించేందుకు సౌలభ్యం ఉందన్నారు.
పుణె పర్యటనలో భాగంగా ఆగస్టు 20న శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలకు తాజా ప్రకటనకు పొంతన కుదరడం లేదు. ఈడీ కేసుల కారణంగానే తమపార్టీలోని కొందరు బీజేపీకి మద్దతు పలుకుతున్నారని అప్పుడు ప్రకటించారు. తాజాగా మాత్రం ఆయన వైఖరి మారడంపై రాజకీయంగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. దర్యాప్తు సంస్థల నుంచి వస్తున్న హెచ్చరికలకు భయపడే బీజేపీలో చేరారని, కొంతమంది మాత్రం తమ రాజకీయ భావజాలాన్ని వీడేందుకు ఇష్టపడటం లేదన్నారు. అనిల్ దేశ్ ముఖ్ లాంటి వారు జైలుకు వెళ్లి పోరాడుతున్నారని చెప్పారు. దర్యాప్తు సంస్థల తీరు కారణంగానే కొందరు ఎన్సీపీ నేతలు బీజేపీ తో చేతులు కలిపారని పుణె పర్యటనలో చెప్పారు. వారం రోజుల్లోనే ఆయన మరో వైఖరిని వెల్లడించడంతో స్పష్టత కొరవడింది.
అజిత్ పవార్ సహా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్డీయేకు మద్దతు తెలుపుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా చేరారు. అభివృద్ధి కోసమే తాము ప్రభుత్వంలో చేరినట్లు వారు ప్రకటించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు