గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిత్సోతకిస్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. 40 ఏళ్ళ తర్వాత గ్రీస్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానిగా నరేంద్రమోదీ రికార్డు నెలకొల్పారు.
జొహానెస్‌బర్గ్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. సమావేశాల ముగింపు తర్వాత అక్కడి నుంచి గ్రీస్ పర్యటనకు వెళ్ళారని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
ఈ ఉదయం ఏథెన్స్ చేరుకున్న భారత ప్రధానికి గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రిటిస్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం గ్రీసు అధ్యక్షుడితో సమావేశమవుతారు. తర్వాత ప్రధానితో పలు అంశాలపై చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ సహకారంపై సమాలోచనలు చేస్తారు.
ఇరు దేశాల వ్యాపారవేత్తలతో సమావేశం అనంతరం ప్రవాసభారతీయులతో పరిచయం కార్యక్రమంలో పాల్గొని చంద్రయాన్-3 విజయంపై ముచ్చటిస్తారని అరిందమ్ బాగ్చి వివరించారు. మోదీకి అపూర్వ స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు, త్రివర్ణ పతాకాలు చేతబూని భారత నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.
2019లో ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న సమయంలో గ్రీస్ ప్రధానితోతో భేటీ అయ్యారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు.
ప్రపంచంలోని అతి పురాతన నాగరికతలైన భారత్, గ్రీస్ మధ్య సంబంధాలు ఇటీవల మరింత బలోపేతం అయ్యాయని, రక్షణ, రవాణా, వాణిజ్యం సహా పలు అంశాల్లో ఇరు దేశాల సంబంధాలూ మరింత దృఢపడ్డాయని చెప్పారు. తాజా పర్యటనతో ఇరుదేశాల మధ్య స్నేహబంధం కొత్తపుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1983 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ గ్రీస్ పర్యటనకు వెళ్ళగా, ఆ తర్వాత ఇన్నాళ్ళకు మోదీ వెళ్ళారు. గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిత్సోతకిస్ 2019లో మనదేశంలో పర్యటించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు