చంద్రయాన్
-3 విజయంతో అద్భుతమైన ఘనత సాధించిన ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి కసరత్తులు
చివరి దశకు చేరాయి. సౌర మండలంలో పరిశోధనలకు గాను చేపట్టే మిషన్ ఆదిత్య ప్రయోగ
తేదీలపై వివరణ ఇచ్చారు.
సూర్యుడిపై
పరిశోధనలకు ఆదిత్య మిషన్ ను సెప్టెంబర్ మొదటి వారంలో చేపట్టనున్నట్లు తెలిపారు.
గగన్యాన్ పరిశోధన ఇంకా మధ్య దశలోనే ఉందన్న సోమనాథ్ .. సెప్టెంబర్, అక్టోబర్ లో ఒక
మిషన్ చేపడతామన్నారు. మానవ సహిత గగన్యాన్ ప్రాజెక్టును 2025లో చేపడతామని ధీమా
వ్యక్తం చేశారు.
చంద్రుడి
దక్షిణ ధృవంపై భారత్ అడుగుపెట్టడంతో ఉన్నతదేశాల జాబితాలో మనదేశమూ
చేరిందన్నారు. ఇస్రో సాధించిన అరుదైన ఘనతపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
సూర్యుడు, శుక్రుడిపై కూడా భవిష్యత్ లో ప్రయోగాలు చేసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఎలాంటి
అవరోధాలు లేకుండా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టడం తనకు పట్టనంత
ఆనందాన్ని మిగిల్చిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. శాస్త్రవేత్తలు, ఇతర
సిబ్బంది ఉమ్మడి కృషి ఫలితంగానే భారీ విజయాన్ని ఇస్రో సాధించగల్గిందని చెప్పారు.
చంద్రుడి
దక్షిణ ధృవం మానవ నివాసానికి యోగ్యమైనది కావడంతోనే ఇస్రో ఆ ప్రదేశాన్ని ల్యాండింగ్
కోసం ఎంపిక చేసిందని వివరించారు. సూర్యుడి ప్రభావం తక్కువగా ఉండటంతో పరిశోధనలకు
ఆప్రదేశం అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్ లో అక్కడ మానవ సహిత కాలనీల
నిర్మాణం, రాకపోకలపై శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేస్తోందని చెప్పారు.