హిమాచల్‌ప్రదేశ్‌ను వరదలు వెంటాడుతున్నాయి. తాజాగా కులు జిల్లాల్లో కురిసిన కుంభవృష్టితో వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో వందలాది
ఇళ్లు కళ్ల ముందే వరదలో కొట్టుకుపోతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బహుళ అంతస్థుల భవనాలు కూడా వరదల్లో పేకమేడల్లా కుప్పకూలి, కొట్టుకుపోయాయి.
జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. రాబోయే రెండు రోజుల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.
అన్ని, కులు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి బహుళ అంతస్థుల వాణిజ్య భవనాలు కొట్టుకుపోయాయి. రెండు రోజుల కిందటే ఈ భవనాల్లో ప్రజలను ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికీ అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కులు, మండి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. కులు మండికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం పండోహ్ రహదారి కూడా కొండచరియలు విరిగిపడి మూసుకుపోవడంతో ఆ ప్రాంతాలకు రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. ఇప్పటి వరకు 709 రోడ్లు మూసుకుపోయాయి. ఈ సీజన్లో వచ్చిన వరదలకు రాష్ట్రానికి రూ.8014 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు ప్రకటించారు.
వరదలకు 2022 ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. 9615 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తం 113 కొండ చరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి. గడచిన రెండు నెలల్లో వచ్చిన వరదలకు 224 మంది చనిపోగా, వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో మరో 117 మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది.