రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. అతని మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యెవ్‌గనీ ప్రిగోజిన్ ప్రయాణించిన జెట్ బుధవారం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి ముందు వరకు విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు గమనించలేదని తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా యెవ్‌గనీ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలిపోవడంపై అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రష్యాకు చెందిన ఫైట్‌రాడార్ సమాచారం ప్రకారం బుధవారం సాయంత్రం 6గంటల 11 నిమిషాల సమయంలో యెవ్‌గనీ ప్రిగోజిన్ జెట్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు
సమాచారం ఆగిపోయిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం 28 వేల అడుగుల ఎత్తులో ఉంది. అక్కడి నుంచి విమాన వేగం క్షణాల్లో అనూహ్యంగా మారిపోయింది. అర నిమిషంలో 28 వేల అడుగుల నుంచి 8 వేల అడుగుల ఎత్తుకు పడిపోయింది. ఆ తరవాత విమానం కుప్పకూలిపోయింది. పొగలు కక్కుతూ విమానం కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ విమాన ప్రమాదంలో యెవ్‌గనీ ప్రిగోజిన్ సహా మొత్తం 10 మంది చనిపోయారని రష్యాకు చెందిన ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఏజన్సీ ప్రకటించింది. ప్రమాద సమయంలో విమానంలో ఏడుగురు ప్రయాణీకులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. యెవ్‌గనీ ప్రిగోజిన్‌తోపాటు వాగ్నర్ గ్రూపు సెకండ్ ఇన్ కమాండ్ దిమిత్ర ఉత్కిన్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రైవేటు జెట్ మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్ వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 8 మృతదేశాలను గుర్తించారు. ఈ ఘటనపై రష్యా దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ విమాన ప్రమాదం రష్యా అధ్యక్షుడు పుతిన్ పనేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. పుతిన్ ఎవరినీ క్షమించడని ఈ ప్రమాదం ద్వారా తేలిపోయిందన్నారు. పుతిన్‌పై నమ్మకంతో యెవ్‌గనీ ప్రిగోజిన్ రాజీ ఒప్పదంపై సంతకం చేశారు. అదే ఇప్పుడు అతని మరణానికి దారితీసిందని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు