దేశమంతా చంద్రయాన్-3 విజయోత్సవ సంబరాల్లో మునిగి ఉండగానే, విక్రమ్ ల్యాండర్ నుంచి బైటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవన్ తన పని మొదలు పెట్టింది.
చంద్రుడి ఉపరితలం మీద విక్రమ్ ల్యాండర్ దిగిన కొన్నిగంటలకు ప్రజ్ఞాన్ రోవర్ దాన్నుంచి బైటకు వచ్చింది. వస్తూనే చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ ఉదయం ప్రజ్ఞాన్ రోవర్ కొంత సమాచారం పంపినట్టు బెంగుళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రం ట్వీట్ చేసింది. చంద్రునిపై పరిశోధనల కోసం ఇండియాలో తయారు చేసిన ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ నుంచి బైటకు వచ్చి ఉపరితలంపై అడుగులు వేయడం మొదలు పెట్టిందని ఇస్రో ట్వీట్ చేసింది.
చంద్రునిపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చక్కగా పనిచేస్తున్నాయని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించారు. విక్రమ్ ల్యాండర్ నుంచి విడివడిన ప్రజ్ఞాన్ రోవర్ నుంచి త్వరలో ఫోటోలు అందుతాయని ఆయన అన్నారు. ఆరు చక్రాలతో 14 రోజుల పాటు పనిచేసే రోవర్ చంద్రుని ఉపరితలంపై అనేక పరిశోధనలు చేయనుందని సోమనాథ్ తెలిపారు. చంద్రునిపై వివిధ పరిశోధనలు చేసేందుకు ల్యాండర్‌కు ఐదు పేలోడ్స్ అమర్చినట్టు ఆయన వెల్లడించారు.
రోవర్‌కు అమర్చిన ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ ద్వారా చంద్రునిపై రసాయన బంధాలు, ఖనిజాల కూర్పులను విశ్లేషిస్తామని ఇస్రో ఛైర్మన్ పేర్కొన్నారు. స్పెక్ట్రోస్కోప్ చంద్రుని నేల స్వభావం, రాళ్ల కూర్పును విశ్లేషిస్తుందన్నారు.
అయనోస్మియర్ లంగ్ముయిర్ చంద్రుని ఉపరితలంపై అయాన్లు, ఎలక్ట్రానులను అంచనా వేస్తుందని, శాటిలైట్ ఉపరితలంపై ఉన్న థర్మో ఫిజికల్ పరికరం ద్వారా చంద్రుని ఉపరితలంపై ఉష్టోగ్రతలు అంచనా వేస్తారు. సీస్మిక్ సిస్టమ్ ద్వారా చంద్రునిపై విక్రమ్ రోవర్ దిగిన ప్రాంతంలో ప్రకంపనల తీరును అంచనా వేస్తారు. విక్రమ్ రోవర్, ప్రజ్ఞాన్‌లకు సౌరశక్తి అందేలా ఏర్పాట్లు చేశారు. అవి రెండూ 14 రోజులు పనిచేస్తాయని, ఈ కాలంలో ఇవి రెండూ ఇస్రోకు సమాచారం పంపుతాయని సోమనాథ్ తెలిపారు. అయితే రోవర్ నుంచి ఇస్రోకు నేరుగా ఎలాంటి లింకు లేదు. రోవర్ నుంచి సమాచారం ల్యాండర్ సేకరించి పంపుతుందని ఆయన వివరించారు.