ప్రపంచంలో
ఏ దేశమూ సాహసించని అద్బుతమైన రోదసీ ప్రయోగంలో భారత్ విజయవంతమైంది. అంతరిక్ష
ప్రయోగాల్లో సూపర్ పవర్‌గా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. చంద్రుడి దక్షిణ
ధ్రువం మీద చంద్రయాన్ 3 స్పేస్‌క్రాఫ్ట్‌లోని విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా
ల్యాండ్ అయింది. కొద్దిరోజుల క్రితమే రష్యా విఫలమైన చోట, అమెరికా కన్నార్పకుండా
చూస్తుండగా, యూరోపియన్ దేశాలు విస్తుపోయి ఉండగా, చందమామ చీకటి సీమల మీద పసిడి వెన్నెలలు
ప్రసరిస్తూ మన ‘విక్రమ్’ అవక్ర విక్రమ పరాక్రమంగా సాఫ్ట్ ల్యాండ్ అయింది.
ఈ
సాయంత్రం 5.44 గంటలకు ల్యాండర్ మోడ్యూల్ నిర్దేశిత ప్రదేశం నుంచి సాఫ్ట్
ల్యాండింగ్ ప్రోసెస్ ప్రారంభించింది. ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ నుంచి కమాండ్స్
తీసుకుంటూ క్రమంగా గమ్యం దిశగా ప్రస్థానం సాగించింది. రఫ్ బ్రేకింగ్ స్టేజ్ దాటాక,
వెర్టికల్ పొజిషన్లోకి దిశ మార్చుకుని, వేగాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ చంద్ర
ఉపరితలం మీద ల్యాండింగ్‌కు ఎంపిక చేసుకున్న స్థానానికి చేరుకుంది.
జులై
14న ఎల్విఎం3 ఎం4 రాకెట్‌ను ప్రయోగించడం ద్వారా మొదలైన చంద్రయాన్ 3 ప్రయోగం ఇవాళ ఆగస్ట్
23 నాటికి చంద్రుడి మీద విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టడం ద్వారా ప్రధాన ఘట్టాన్ని
పూర్తి చేసుకుంది. ఇక ల్యాండర్ నుంచి మరో నాలుగు గంటల్లో ప్రజ్ఞాన్ రోవర్ బైటపడి
చంద్రుడి దక్షిణధ్రువపు ఉపరితలం మీదకు దిగుతుంది. అప్పటినుంచీ శాస్త్రీయ పరిశోధనలు
ప్రారంభమవుతాయి.